రంగారెడ్డి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమిలో ఎన్ఐయూఎం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయం నిర్మించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా పురపాలకశాఖ కార్యదర్శి శ్రీదేవి, ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శశాంక్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఫార్మాసిటీకోసం సేకరించిన భూములను ఫార్మా అనుబంధ కంపెనీలకే కేటాయిస్తామని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మా త్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఫ్యూచర్‌సిటీలో భాగమైన ఈ భవనాలను ఫార్మాసిటీ భూముల్లో నిర్మిస్తున్నారు. మీర్ఖాన్పేట్ గ్రామంలోని సర్వే నంబర్ 112లో గల భూములను గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించింది. ఇప్పటికే 112 సర్వే నంబర్లో 50ఎకరాల భూమిని స్కిల్ యూనివర్సిటీ భ వన నిర్మాణం, వైస్ చాన్సలర్ కార్యాలయం, ప్రయోగశాలలు వంటి వాటికి కేటాయించింది. కొత్తగా మరో 20ఎకరాల్లో ఎన్ఐయూఎం కార్యాలయం ఏర్పాటుకు కేటాయించింది. ఫ్యూచర్‌సిటీ కోసం ఏర్పాటుచేస్తున్న 330ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సమీపంలోనే ఈ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరుగనున్నదని అధికారులు తెలిపారు. మ రిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో మీర్ఖాన్పేట్, తిమ్మాయపల్లి గ్రామాల్లో కూడా స్థలాలు కేటాయించేందుకు ఫ్యూచర్‌సిటీ అథారిటీ డెవలప్మెంట్ నిర్ణయించింది.
ఓవైపు ఆందోళనలు..మరోవైపు కేటాయింపులు..
ఫార్మాసిటీకి భూములిచ్చిన తమకు రావాల్సిన అన్ని సదుపాయాలు ఇవ్వాలని ఓవైపు రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వారి హామీలను అమలుచేయకుండా భూములు కేటాయిస్తున్నది. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు ఎకరాకు గుంట భూమి చొప్పున ఇండ్ల స్థలాలు ఇస్తామని, కుటుంబంలో అర్హులైన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు భూ ములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోగా, ఇంటికో ఉద్యోగం మాట కూడా పెడచెవిన పెట్టింది. దీంతో రైతులు తమకిచ్చిన హామీ మేరకు ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.