ఢిల్లీ ,జూన్ 22: కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్‌ను అడ్డుకోవచ్చని నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ అభిప్రాయపడ్డారు.కోవిడ్ నియంత్రణకు తగిన జాగ్రత్తలు పాటించి, మనమంతా వ్యాక్సినేషన్ తీసుకుంటే అసలు థర్డ్ వేవ్ ఎందుకు వస్తుంది? అసలు సెకండ్ వేవ్ కూడా రాని దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తే మామూలు పరిస్థితితులు నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు.
భారత దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కేలా చేయాలంటే, మామూలు కార్యకలాపాలన్నీ తిరిగి కొనసాగాలంటే వేగవంతంగా వ్యాక్సినేషన్ నిర్వహించడం చాలా ముఖ్యమని వి.కె. పాల్ స్పష్టం చేశారు. “మన దైనందిన కార్యకలాపాలను, సామాజిక జీవితాన్ని తిరిగి కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించి ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకోవడమూ అవసరమే, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టగలిగినప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం” అని ఆయన వివరించారు.