Nithyananda Reddy : కడప జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత నిత్యానందరెడ్డికి న్యాయస్థానం మంగళవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పెద్ద దస్తగిరి హత్య కేసులో అరెస్టయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డిని పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు.
విచారణ అనంతరం న్యాయమూర్తి.. నిత్యానంద రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప జిల్లాలో కీలక నేతగా ఉన్న నిత్యానందరెడ్డి అరెస్ట్, రిమాండ్ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా..? అనే కోణంలో చర్చ సాగుతోంది. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.