Budget 2023-24 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనది ప్రత్యేక శైలి అని మరోమారు రుజువు చేసుకున్నారు. బుధవారం 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభలో ప్రతిపాదించారు. ఈ దఫా తన బడ్జెట్ ప్రసంగం కుదించేశారు. కేవలం 86 నిమిషాల్లోనే నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ముగించారు.
గతేడాది నిర్మలా సీతారామన్ 92 నిమిషాల సమయం తీసుకున్నారు. అంతకుముందు 2021లో గంటా 50 నిమిషాల సమయం తీసుకున్నారు. 2020లో భారత దేశ చరిత్రలోనే ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాల రికార్డులను తిరగరాశారు.
2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. నాటి బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసేందుకు ఆమె 2.40 గంటల సమయం తీసుకున్నారు. మధ్యలో అస్వస్తతకు గురయ్యారు. ఫలితంగా ఊపిరి పీల్చుకునేందుకు కొద్ది సేపు రెస్ట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు సభ్యులు ఇచ్చిన ఎలక్ట్రోలైట్స్ ఆమె తీసుకోవడం కనిపించింది. బుధవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ..`దిస్ ఈజ్ ది ఫస్ట్ బడ్జెట్ ఇన్ అమృత్ కాల్` అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ సర్కార్లో తొలి ప్రాధాన్యం సమగ్ర అభివృద్ధి అని చెప్పారు.