కంఠేశ్వర్, అక్టోబర్ 5: హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో నిజామాబాద్‌లో కూడా నిడ్రా వస్తుందని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. నిజామాబాద్‌కు నిడ్రా రావాల్సిన అవసరం ఉన్నదని, కచ్చితంగా వస్తుందని చెప్పారు. ప్రభుత్వ భూములు, దేవాలయ, యూనివర్సిటీ స్థలాలను ఎవరు కబ్జా చేసినా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కబ్జాల విషయంలో పార్టీలకతీతంగా ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సీపీలకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. జిల్లాలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అధికారాలను బదలాయించేలా ఆర్డినెన్స్!
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హైడ్రా చట్టబద్ధత కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీకి, కమిషనర్‌కు ఉండే అధికారాలను ఏదేని ఏజెన్సీకి లేదా అథారిటీకి, అధికారికి బదలాయించేలా జీహెచ్ఎంసీ చట్టం-1955లో మార్పులు చేసింది. సెక్షన్ 374-ఏకు సవరణ చేస్తూ 374-బీ సెక్షన్‌ను జోడించింది. ప్రభుత్వ సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఈ నెల 3 నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ‘రోడ్లు, నాలాలు, జలవనరులు, ఖాళీ ప్రదేశాలు, పార్కులు, వీధులు తదితర కార్పొరేషన్/రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడం, నిరంతరం పర్యవేక్షించడం’ కోసం ఈ మార్పులు చేస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొన్నది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతోపాటు విపత్తుల నిర్వహణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.