హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 30కి పైగా నర్సింగ్ కళాశాలలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) సీరియస్ అయింది. హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ జరిపింది. డీఎంఈ, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ అక్టోబర్ 28న మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీలోని మానవ అధికార్ భవన్లో నివేదికలతో హాజరు కావాలని ఆదేశించింది. నిర్ణీత తేదీకి వారం ముందు నివేదికలు అందితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టంచేసింది.