హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో భవిష్యత్తరాలకు భరోసా కల్పించవచ్చని పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహారి తెలిపారు. దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఐటీపీ 39వ బ్యాచ్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రత్నాకర్ జౌహారికి శిక్షణ పూర్తిచేసుకున్న బీట్ ఆఫీసర్లు పాసింగ్ పరేడ్ నిర్వహించారు. అనంతరం టీజీఎఫ్డీసీ ఎండీ సునీత ఎం భగవత్‌తో కలిసి శిక్షణార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. మొత్తం 100 మంది శిక్షణలో చేరగా, వీరిలో 25 మంది మహిళలు, 75 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఒకరు మధ్యలోనే వెనుదిరుగడంతో 99 మంది శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు.