తెలంగాణ ఆర్చర్, పెద్దపల్లి బిడ్డ తానిపర్తి చికిత తన తొలి ఆసియా క్రీడల్లోనే అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలే లేకుండా బరిలోకి దిగిన ఆమె అసాధారణ గురితో అదరగొట్టింది. మహిళల కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలతో డబుల్ ధమాకా మోగించి 2028 ఒలింపిక్స్ కోటా కూడా దక్కించుకుంది. పురుషుల జట్టు కూడా పసిడి నెగ్గడంతో భారత కాంపౌండ్ టీమ్స్ ఈ మెగా గేమ్స్‌లో గోల్డెన్ హ్యాట్రిక్ నమోదు చేశాయి. షూటింగ్లో హైదరాబాదీ కైనన్ చెనాయ్ స్వర్ణానికి గురి పెట్టగా.. బుధవారం ఒక్క రోజే భారత్ నాలుగు స్వర్ణాలు, మరో మూడు కాంస్యాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది.

నగోయా: ఆసియా క్రీడల్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు కేక పుట్టించారు. పురుషుల, మహిళల, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణభేరి మోగించారు. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికిత, జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్‌తో కూడిన భారత్ 238-234తో చైనా (వునియేర్, యువాన్ వాంగ్, ఫాంగ్యావో వెయ్) జట్టును చిత్తు చేసి బంగారు పతకాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆర్చర్లు 238 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేశారు. అనంతరం ఉత్కంఠగా జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత, సాహిల్ జాదవ్ జోడీ 158-157తో దక్షిణ కొరియాకు చెందిన జంగ్ యూన్ పార్క్- చోయ్ ఎన్ గ్యు జోడీపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. నిర్ణీత రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు 157-157తో సమంగా నిలవడంతో షూటాఫ్ నిర్వహించారు.
షూటాఫ్‌లో ఒత్తిడిని అధిగమించి చికిత, సాహిల్ ఇద్దరూ పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించగా, కొరియా ఆర్చర్ చోయ్ 9 పాయింట్లకే పరిమితం కావడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. దాంతో పాటు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా చికిత, సాహిల్ రికార్డు సృష్టించారు. ఆపై పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో ఏపీ కుర్రాడు గణేష్ మణిరత్నం, కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్‌తో కూడిన భారత త్రయం 238-237తో చైనాజట్టును ఓడించడంతో కాంపౌండ్ టీమ్ ఈవెంట్లను భారత్ గోల్డెన్ స్వీప్ చేసింది.

Pratheeka Chikitha Jyothi
స్వర్ణ తీన్మార్ కొడుతుందా?
ఒకే రోజు రెండు స్వర్ణాలతో సత్తా చాటిన చికితను మూడో స్వర్ణం ఊరిస్తోంది. వ్యక్తిగత విభాగంలో క్వాలిఫికేషన్, ఆరంభ రౌండ్లలో సత్తా చాటిన తను గురువారం జరిగే మహిళల వ్యక్తిగత కాంపౌండ్ క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన నురియా దియాన్తో పోటీ పడనుంది. ఇందులో గెలిస్తే సెమీస్ తదుపరి ఫైనల్లో ఆడనుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానం సాధించిన చికిత అదే జోరు కొనసాగిస్తే మరో పతకం నెగ్గడం కష్టమేం కాబోదు.

Kushal Sahil And Ganesh
అంతా నాన్న వల్లే
నా తొలి ఆసియాడ్లోనే రెండు స్వర్ణ పతకాలు గెలవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తోంది. ఆర్చరీని నేను నా సొంతంగా ఎంచుకోలేదు. అదంతా మా నాన్న నిర్ణయమే. 2018లో ఆర్చరీ ప్రారంభించినపపుడు మాకు ఈ ఆట గురించి పెద్దగా ఏమీ తెలియదు. కానీ, అభిషేక్ వర్మ (భారత దిగ్గజ ఆర్చర్) నాకు ఎంతో మద్దతుగా నిలుస్తూ ఆటలో రాటుదేలేలా శిక్షణనిసున్నారు. ఆయనే నా స్ఫూర్తి. గత ఏడాది నేను వరల్డ్ జూనియర్ చాంపియన్ అయిన తర్వాత, మళ్లీ అదే స్థాయిలో ప్రదర్శన చేయడం నాకూ చాలా కష్టంగా మారింది.
కొన్ని నెలలుగా ఎన్నో సమస్యలు, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాను. కానీ ఈ రోజు సాధించిన స్వర్ణ పతకాలు నాపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించాయి. విమెన్స్ టీమ్ గోల్డ్ గెలిచిన తర్వాత మిక్స్డ్ ఫైనల్ ఆడేందుకు ఎక్కువ సమయం లేదు. చాలా గాబరాగా వెళ్లి.. పోటీ ప్రారంభమయ్యే సమయానికి చేరుకొని సాహిల్‌తో కలిసి మ్యాచ్‌కు రెడీ అయ్యా. తీరా నాలుగో సెట్లో చెరో 9 పాయింట్ల షాట్లు మాత్రమే చేసి మ్యాచ్ షూటాఫ్‌కు దారి తీయడంతో ఒక్క నిమిషం అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. షూటాఫ్‌లో నా బెస్ట్ ఇవ్వాలని అనుకున్నా. ప్రశాంతంగా ఉండి.. ఆటపైనే దృష్టి కేంద్రీకరించి మరో స్వర్ణం అందుకున్నా.
-చికిత
సునీల్‌కు బ్రాంజ్

Sunil Kumar
రెజ్లింగ్ పోటీల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. గ్రీకో రోమన్ రెజ్లర్, గత ఎడిషన్‌లోనూ పతకం గెలిచిన సునీల్ కుమార్ (87 కిలోలు) తాజాగా మరో కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాంస్య పోరులో అతడు టెక్నికల్ సుపిరియారిటీ (9-0)తో ఫిలిప్పీన్స్ రెజ్లర్ రాబర్ట్స్ జాన్‌స్టన్‌పై గెలిచి వరుసగా రెండో పతకాన్ని సాధించాడు.
