22ఏపై ఎన్హెచ్ఆర్సీ సమన్లు
రాష్ట్రంలో ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
- డిసెంబర్ 7న స్వయంగా హాజరుకావాలని ఆదేశం
- లక్షలాది ప్రైవేట్ పట్టా భూములు 22-ఏలోకి
- నోటీసులు, గెజిట్ లేకుండా నిషేధించడంపై సీరియస్
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శికి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)కి జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) షరతులతో కూడిన సమన్లు జారీచేసింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ సెప్టెంబర్ 3న దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మానవ హకుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 13 కింద కమిషన్ ఈ నెల 13న సమన్లు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో భూ రికార్డులను ధరణి నుంచి భూభారతి పోర్టల్‌కు మార్చే క్రమంలో భూయజమానులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరుపకుండా, కనీసం గెజిట్ నోటిఫికేషన్ కూడా లేకుండా లక్షలాది ప్రైవేట్ ఆస్తులను 22-ఏ జాబితాలో చేర్చారన్న ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఇది పౌరుల జీవనోపాధి, ఆత్మగౌరవం, రాజ్యాంగబద్ధమైన ఆస్తి హకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టంచేసింది.
నివేదికకు డుమ్మా.. ఢిల్లీకి రావాల్సిందే
నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులకు సంబంధించి జిల్లాల, మండలాల వారీ గణాంకాలు, అందుకు ఆధారమైన ఉత్తర్వులు, యజమానులకు ఇచ్చిన విచారణ అవకాశాలు, గెజిట్ ప్రచురణ వివరాలతో కూడిన చర్యల నివేదికను సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ సెప్టెంబర్ 21న ఆదేశాలు జారీచేసింది. అయితే రెండు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా సమన్లు జారీచేసింది. దీని ప్రకారం సంబంధిత ఉన్నతాధికారులు స్వయంగా గానీ, అధీకృత ప్రతినిధి ద్వారా గానీ వచ్చే నెల 7న మధ్యాహ్నం 2:00 గంటలకు న్యూఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో పూర్తి నివేదికతో హాజరుకావాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణ తేదీకి వారం రోజులముందే సంతృప్తికరమైన నివేదికను అందజేస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని కమిషన్ షరతు విధించింది.
రైతులు, యజమానుల తిప్పలు బంద్ కావాలి
రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులు తమ సొంత ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోలేక, అమ్ముకోలేక, బ్యాంకుల్లో తనఖా పెట్టలేక రెవెన్యూ, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కారుపోతుల రేవంత్ ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల తప్పిదాలతో పొరపాటుగా 22-ఏ జాబితాలో చేర్చిన ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను అత్యంత పారదర్శక ప్రక్రియ ద్వారా తక్షణమే తొలగించి యజమానులకు ఊరట కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని బాధిత భూ యజమానులందరికీ పూర్తి న్యాయం జరిగే వరకు చట్టబద్ధమైన అన్ని వేదికలపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

