హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా, లేఆఫ్‌ల భయం, ట్రంప్ టెంపరితనం తదితర అనేక భయాందోళనలు పట్టిపీడిస్తున్నా విద్యార్థులు వీటిని లెక్కచేయడం లేదు. తమ దారి బీటెక్ దారే అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు ఆదరణ పెరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇన్ని భయాల నడుమ ఈ సంవత్సరం ఇంజినీరింగ్‌లో 8 వేల అడ్మిషన్లు పెరిగాయి.
రాష్ట్రంలో గత ఆరేండ్లుగా బీటెక్‌లో ప్రవేశాలు ఊపందుకున్నాయి. అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఆరేండ్లలో ఆల్‌టైమ్ రికార్డుతో 37, 389 అడ్మిషన్లు పెరిగాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019లో 46,134 మంది మాత్రమే చేరగా, ఈ విద్యాసంవత్సరం 83,521 మంది ప్రవేశాలు పొందారు. గతంలో మొత్తం సీట్లలో 60 శాతం కూడా నిండని పరిస్థితి. ఈసారి ఏకంగా 91.28% సీట్లు నిండాయి. కేవలం 7,974 సీట్లు మాత్రమే మిగిలాయి.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బీటెక్ సీట్ల సంఖ్యతోపాటు అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ఆరేండ్లలో 25,930 సీట్లు పెరిగాయి. ఇవన్నీ కన్వీనర్ కోటా సీట్లే. బీటెక్ కోర్సుల్లో గతంలో లక్షకు పైగా సీట్లుండేవి. విద్యార్థులు చేరకపోవడం, కాలేజీల మూసివేతతో సీట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2019లో కన్వీనర్ కోటా సీట్లు 65వేలు మాత్రమే ఉండేవి. ఈ విద్యాసంవత్సరంలో 83 వేల సీట్లకు పెరిగాయి. పలు ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్, ప్రైవేట్ వర్సిటీలుగా అవతరించినా సీట్లు పెరుగుతుండం విశేషం. ఏటా ఫలితాల్లో అమ్మాయిల హవా కనిపిస్తున్నది. అయితే అడ్మిషన్ల విషయానికి వస్తే అబ్బాయిలదే అధిపత్యంగా ఉన్నది. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు 9 శాతం అధికంగా సీట్లు దక్కించుకున్నారు. ఈసారి మొత్తంగా 83,521 సీట్లు భర్తీ అయ్యాయి. 77 కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.