– ఏడు దశాబ్దాల చరిత్రలో తొలిసారి కాన్వకేషన్ డే
– ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్
నల్లగొండ విద్యావిభాగం, జూలై 18 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) 70వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ప్లాటినం జూబ్లీ సంబరాలు, తొలి స్నాతకోత్సవం (కాన్వకేషన్ డే) అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ శనివారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో ఈ వేడుకలు జరగనున్నాయి. 1956 జూలై 22న ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా కేవలం బి.ఏ. గ్రూపుతో ప్రారంభమైన ఈ కళాశాల, నేడు న్యాక్ ‘బి’ గ్రేడ్, అటానమస్ హోదాతో సుమారు 30 కోర్సులు, 4,800 మంది విద్యార్థులతో విరాజిల్లుతోంది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్రలో ఎంతో మంది సాహిత్యకారులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను దేశానికి అందించిన ఘనత ఈ చదువులమ్మ తల్లికి దక్కుతుందని ప్రిన్సిపాల్ కొనియాడారు.

జ్ఞాన జ్యోతికి 70 ఏళ్లు.. ఈ 22న ఎన్జీ కళాశాల ప్లాటినం జూబ్లీ, కాన్వకేషన్ వేడుకలు
కళాశాల చరిత్రలోనే మొదటిసారిగా ఈ కాన్వకేషన్ డే నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన వారికి, 2025-26లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ వేడుకలో పట్టాలు అందజేయనున్నారు. ఇందులో భాగంగా డిగ్రీ విభాగంలో 18, పీజీ విభాగంలో 5 చొప్పున మొత్తం 23 బంగారు పతకాలను ప్రతిభావంతులకు ప్రదానం చేయనున్నారు. పట్టాలు తీసుకోబోయే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి రావచ్చునని పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య కె. అంజిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య జి.ఉపేందర్ రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్లు ఆచార్య డి.ఎస్.ఆర్.రాజేంద్ర సింగ్, ఆచార్య పి. బాలభాస్కర్, విద్యా విషయక సమన్వయకర్త ఆచార్య వి. రాజేంద్ర ప్రసాద్, రూసా కోఆర్డినేటర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ తదితరులు హాజరుకానున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ సకాలంలో హాజరై ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.