నమీబియాపై న్యూజిలాండ్ విజయం
షార్జా: నాకౌట్ బెర్త్ దక్కించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న న్యూజిలాండ్ గ్రూప్-2లో మూడో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం నమీబియాతో జరిగిన పోరులో విలియమ్సన్ సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. 16 ఓవర్లు ముగిసేసరికి 96/4తో ఉన్న ఆ జట్టు.. నీషమ్ (35 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), ఫిలిప్స్ (39 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) జోరుతో చివరి నాలుగు ఓవర్లలో 67 పరుగులు రాబట్టి భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులకే పరిమితమైంది. వాన్ లినెన్ (25) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నీషమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్.. రన్‌రేట్ (+1.277)లోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆదివారం జరుగనున్న లీగ్ మ్యాచ్‌లో అఫ్గాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధిస్తేనే.. టీమ్ఇండియాకు సెమీస్ చాన్స్ ఉంటుంది.