హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాత వాహనాల నిర్మూలన కోసం వచ్చే ఏడాది జనవరి నుంచి నూతన స్క్రాప్ పాలసీని అమలు చేసేందుకు రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ విధానంలో 15 ఏండ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 8 ఏండ్లు దాటిన వాణిజ్య వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణించనున్నారు. వాటిని తుకు(స్క్రాప్)గా మార్చేందుకు త్వరలో రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 15 ఏండ్లు దాటిన వాహనాలు దాదాపు 21 లక్షల వరకు ఉన్నాయి. ఒక హైదరాబాద్లోనే 9 లక్షల వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉన్నది.