న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ప్రభుత్వ బ్యాంకుల్లో అంతకంతకూ పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ఆర్థికశాఖ సమాయత్తమైంది. నికర నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) ఖాతాల కోసం ‘యూనిఫాం స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్’ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. రూ.50 కోట్ల వరకు లావాదేవీలు జరిపే ఖాతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. రుణాలను ఆమోదించే బ్యాంకు అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.