హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి సినీ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఓ స్టార్ హీరో, ప్రతిభ గల దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తానని రాజమౌళి ప్రకటించాడు. అటు మహేష్ కూడా తన తర్వాతి సినిమా రాజమౌళితో ఉంటుందని వెల్లడించారు. వీళ్లు మరో అడుగు ముందుకు వేయడమే గానీ ఆపే ప్రతికూల పరిస్థితులేం లేవు. రాజమౌళి మహేష్ సినిమా మీదే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. మహేష్‌కు ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ ఉంది. రాజమౌళి ఎలాగూ ప్రీ ప్రొడక్షన్‌కు చాలా సమయం తీసుకుంటాడు కాబట్టి మహేష్ త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తున్నది. ఈ సినిమా కథకు ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ నేపథ్యంతో సాగే అడ్వెంచర్ లైన్ అనుకుంటున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో చెప్పారు. అయితే తాజా సమాచారం మేరకు మహేష్ రాజమౌళి సినిమా స్పై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనుందట. ఈ తరహా సినిమాల్లో కావాల్సినంత యాక్షన్‌కు అవకాశం ఉంటుంది కాబట్టి దర్శకుడు ఆ కథ వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తున్నది.