మనుచరిత్రము
(ప్రతి పద్యానికి వాడుక భాషలో వివరణతో)
పేజీలు: 395, వెల: రూ.504 ఆముక్తమాల్యద
పేజీలు: 555, వెల: రూ.657
పాండురంగ మాహాత్మ్యం
పేజీలు: 698, వెల: 855
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
www.srpublications.in
‘అల్లసాని వారి అల్లిక జిగిబిగి’ అని తెలుగు వాఙ్మయంలో ప్రసిద్ధ వ్యాఖ్య. ఆయన పద్యాల అల్లిక ‘జిగి’- తళుకు బెళుకులు కలిగి ఉంటుంది. అదే సమయంలో ‘బిగి’- సన్నివేశాన్ని బిగువుగా కట్టిపడేసేలా వర్ణించడంలో పెద్దనకు పెద్దనే సాటి. ఆయన కవిత్వం ఎంత రసరమ్యంగా ఉంటుందో మనుచరిత్ర చదివితే అర్థమవుతుంది. వరూధుని, ప్రవరాఖ్యుల కథ ప్రధానంగా సాగే ఈ ప్రబంధంలో ప్రతీ పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. ఇందులో ఆయన హిమగిరులను వర్ణించిన తీరు హిమవన్నగమంత సుందరంగా ఉంటుంది. పెద్దన కలం నుంచి జాలువారిన ‘మనుచరిత్రము’ ప్రబంధాన్ని మరింతమందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రంథంలో ప్రతి పద్యానికి వాడుక భాషలో వివరణ అందించారు. పద్యాన్ని సులువుగా అర్థం చేసుకునే రీతిలో తాత్పర్యాన్ని పొందుపరిచారు రచయితలు డాక్టర్ పమ్మి పవన్‌కుమార్, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. అవసరమైన చోట వివరణ కూడా ఇచ్చారు. నాణ్యమైన ముద్రణ ఈ గ్రంథానికి అదనపు బలం. లలితమైన పదాలతో రాసిన భావం చదువుతుంటే పద్యం కూడా బట్టీ పట్టేయాలనే ఆసక్తి కలుగుతుంది.
తెలుగు భాషా వైభవాన్ని భావి తరాలకు చేరువ చేయాలనే సంకల్పంతో కృష్ణ దేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ కావ్యంలోని పద్యాలకూ వాడుక భాషలో వివరణతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ బాధ్యతను పవన్‌కుమార్ సమర్థంగా నిర్వర్తించారు. డాక్టర్ డీవీజీఏ సోమయాజులుతో కలిసి ఆయనే.. తెనాలి రామకృష్ణ కవి రచించిన ‘పాండురంగ మాహాత్మ్యం’ కావ్యంలోని పద్యాలకూ వాడుక భాషలో భావాలను అందించారు. రాయల కాలపు మూడు ప్రసిద్ధ ప్రబంధాలను ఇప్పటి వారికి సుబోధకంగా ఉండేలా రచయిత చేసిన ప్రయత్నం అభినందనీయం. మిగిలిన ప్రచురణ సంస్థలూ ఇదే బాటలో నడవాలి.
–కణ్వస
మనసును కుదుటపరిచే కథలు
రసశేవధి
రచన: టి.శ్రీవల్లీ రాధిక
పేజీలు: 152; వెల: రూ. 250,
ప్రచురణ: ప్రమథ ప్రచురణలు
ప్రతులకు: 94416 44644
మనిషి జీవితం సుఖదుఃఖాల మయం. గెలిచినప్పుడు ఆనందపడిపోతాం. అదే ఓటమి ఎదురైతే మాత్రం జీవితం నుంచి పారిపోవాలని అనిపిస్తుంటుంది. అలాంటి ఆలోచనలను విరమింపజేసి, మనసును కుదుటపడేలా చేసే కథల సమాహారమే టి.శ్రీవల్లీ రాధిక ‘రసశేవధి’. శేవధి అంటే నిధి అని అర్థం. నిజంగానే ఈ సంపుటి జీవితంపట్ల ఆశలు చిగురింపజేసే నిధి. జీవితం నిస్సారంగా గడుస్తున్నది అనుకున్న మనిషికి కనువిప్పు కలిగించే కథ ‘రసశేవధి’. ఇది చదువుతూ ఉంటే మన మనసులలో గూడుకట్టుకుపోయిన భారమంతా ఒక్కసారిగా దిగిపోతుంది. లలితా సహస్రంలో అమ్మవారి నామాల్లో ‘రసశేవధిః’ ఒకటి. అంటే మన జీవిత ప్రయాణంలో కూడా అపారమైన ‘అమ్మదయ’ మనమీద ప్రసరిస్తూ ఉంటుందని నిరూపిస్తుంది ఈ కథ. ఇక ‘నాన్న దగ్గరికి’ కథ శ్రీకృష్ణ జననాన్ని ప్రతీకగా పట్టిచూపుతూ, కొత్త కోణంలో ఆవిష్కరించి మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. కాలస్వరూపాన్ని అర్థం చేయించే ‘అఖండ దర్శనం’, ఆత్మన్యూనత ఉన్నవారితో ప్రయాణించడం సాహసమని చెప్పే ‘సాహసం’, మంచి లక్ష్యం వైపు సాగే ప్రయాణంలో రాముడి (దేవుడి) తోడు ఎప్పుడూ ఉంటుందని చెప్పే ‘దారిమధ్యలో’.. ఇలా ‘రసశేవధి’లోని ప్రతీ కథా మనల్ని ఆనంద రసంలో ఓలలాడించేదే.
– హర్షవర్ధన్
బుక్ షెల్ఫ్
గురుగోవిందమాంబ గారి జీవితచరిత్ర
రచన: డా॥ కపిలవాయి లింగమూర్తి
పేజీలు:106, వెల: రూ.100
ప్రతులకు: 87907 27772
విద్యార్థుల విజయానికి మార్గదర్శకాలు
రచన: జస్టిస్ బి.చంద్రకుమార్
పేజీలు:190,
వెల: రూ. 150
ప్రతులకు: యూనివర్సల్ బుక్ షోరూములు
ఫోన్: 89783 85151
ఆ రోజుల్లో…
రచన: రాధాకుమార్
పేజీలు: 200, వెల: రూ. 150
ప్రతులకు: సుమిర క్రియేషన్స్
ఫోన్: 94903 70248
నాటక నానీలు
రచన: కె.శాంతారావు
పేజీలు: 62, వెల: రూ. 80
ప్రచురణ: వనమాలి ప్రచురణలు
ప్రతులకు: 99597 45723
చరిత్ర మరవని వీరయోధుడు
యానాల మల్లారెడ్డి
సమగ్ర జీవిత చరిత్ర
రచన: దుబ్బ రంజిత్
పేజీలు: 215,
వెల: రూ. 200
ప్రచురణ: అన్విత్ అర్జిత్ ప్రచురణలు
ఫోన్: 99120 67322