ఒక మహిళ విమానం నడిపిందంటే అద్భుతం అంటాం. రోదసిలోకి దూసుకెళ్లిందంటే వారెవ్వా అనేస్తాం. అదే మహిళ ఓ భారీ ట్రక్‌ను నడిపిందని తెలిస్తే… ఆశ్చర్యం మాట అటుంచితే! ఎందుకంత కష్టం వచ్చిందని సానుభూతి ప్రకటిస్తాం!! హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నీల్కమల్ ఠాకూర్ ట్రక్ స్టీరింగ్ పట్టుకున్న తొలి మహిళగా ఆ రాష్ట్రంలో రికార్డు సృష్టించింది. కానీ, టన్నులకొద్దీ లోడ్ ఉన్న ట్రక్ ఆమె ఎందుకు ఎక్కింది? ఎందుకు నడిపింది? అని ఆరా తీస్తే.. మన హృదయం బరువెక్కుతుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చన్న ధైర్యమూ కలుగుతుంది.
నీల్కమల్ ఠాకూర్ గురించి హిమాచల్‌ప్రదేశ్ కొండదారుల్లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. తొమ్మిదేండ్లుగా ఆమె ట్రక్ తిరగని లోయ లేదు, ఎక్కని కొండ లేదు! ఓ సిమెంట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ లోడ్ వేసుకొని.. అనుకున్న సమయానికి చెప్పిన చోటుకు వెళ్లి అన్లోడ్ చేయడంలో ఆమె దిట్ట. నిమిషం ఆలస్యం చేయదు. అర నిమిషం వృథా కానివ్వదు. పగటి పూట ఎంత హుషారుగా లారీ నడుపుతుందో, రాత్రిళ్లూ అంతే జాగ్రత్తగా దూసుకుపోతుంది. తన ప్రయాణంలో విశేషాలను సోషల్ మీడియాలోనూ పోస్టు చేస్తుంటుంది. రాష్ట్రస్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుంది కూడా! ఓ పదేండ్ల కిందటి దాకా ప్రశాంతంగా సాగిన ఆమె జీవితాన్ని ఓ దుర్దినం పూర్తిగా మార్చేసింది. తన భర్తను, కొడుకును ఆప్యాయంగా నిమిరే ఆమె చేతుల్లోకి స్టీరింగ్ వచ్చేలా చేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా పిప్లుఘాట్లో నీల్కమల్ దంపతులు ఉండేవాళ్లు. ఆమె భర్త ట్రక్ డ్రైవర్. బ్యాంకు లోనుతో రెండు ట్రక్లు తీసుకున్నాడు. ఒకటి ఆయనే నడిపేవాడు, ఇంకోటి కిరాయికి ఇచ్చేవాడు. భారీ లోడుతో సుదూరాలకు వెళ్లడం ఆయనకు పరిపాటి. పదేండ్ల కిందట.. ఓ రోజు భర్త రాకకోసం ఎదురుచూస్తున్నది నీల్కమల్. ఐదేండ్ల కొడుకును ఒళ్లో కూర్చోబెట్టుకొని రాజ్మా, చపాతీ తినిపిస్తూ.. అన్యమనస్కంగానే ఏవో కథలు చెబుతున్నది. ఏ లారీ శబ్దం వచ్చినా ఆశగా దారి వంక చూడటమూ, వచ్చింది ఆయన కాదని తెలిసి నిరాశ చెందటమూ.. ఇలాగే గడిచింది రోజంతా! ఆయన ఇంటికి వస్తానన్న సమయం దాటిపోయింది. ఏ తెల్లవారుజామునో ఇంటి ముందు ఏదో అలికిడి. వచ్చింది ట్రక్ కాదు.. అంబులెన్స్. అందులోంచి భర్త మృతదేహాన్ని దింపారు. నీల్కమల్ కాళ్లకింద భూకంపం వచ్చినట్టయింది. ఆ ఇల్లు శోక సంద్రమైంది. రోజులు భారంగా గడవసాగాయి. ఇంటిపట్టునే ఉంటే బిడ్డ ఆకలి తీరేదెలా? వయసు పైబడిన తన తల్లిని చూసుకునేదెలా? పక్షవాతంతో మంచానపడ్డ తండ్రి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలు ఆమెను మరింత కుంగదీశాయి.
నీల్‌కమల్‌కు కారు నడపడం వచ్చు. భర్తతో వెళ్లినప్పుడు సరదాగా ట్రక్ స్టీరింగూ పట్టుకునేది. వాటిని కిరాయికి తిప్పుతూ కుటుంబ భారం మోయాలనుకుంది. అలా అనుకుందో లేదో.. బ్యాంకు అధికారులు వచ్చి రెండు ట్రక్లనూ సీజ్ చేశారు. వారికి తన పరిస్థితి వివరించి సాయపడాలని కోరింది. బ్యాంకు అధికారులు కనికరించారు. రెండు ట్రక్కులు ఆమెకు అప్పగించారు. ఇద్దరు డ్రైవర్లను నియమించుకొని పనిలో దిగింది నీల్కమల్. రెండు రోజులు గడిచాయో లేదో.. ఓ డ్రైవర్ డ్యూటీకి ఎగనామం పెట్టాడు. ఇంకో వారానికి మరో డ్రైవర్ ట్రక్ తాళం చెవులు ఆమెకు అప్పగిస్తూ.. ‘ఈ రోజు నాకు వేరే పనుంది’ అని వెళ్లిపోయాడు. అత్యవసరంగా సరుకు డెలివరీ ఇవ్వాలి. డ్రైవర్లు అందుబాటులో లేరు. లోడ్ పంపకపోతే మాటొస్తుంది. తన జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. గత్యంతరం లేక తానే రంగంలోకి దిగింది. పొద్దు పొడుస్తున్న వేళ.. ఆమెలో ధైర్యం ఉదయించింది. పదిహేనేండ్ల మేనల్లుడిని తోడుగా రమ్మని.. తానే స్టీరింగ్ అందుకుంది. కంపెనీ నుంచి సిమెంట్ లోడ్ తీసుకొని.. 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణానికి చేర్చింది. ‘ఆ రాత్రి ప్రయాణం నాకు ఇప్పటికీ గుర్తు! లారీ నడపడం అప్పటికైతే ఓ మోస్తరుగా వచ్చంతే! కానీ, ఎలాగైనా లోడ్ అప్పగించాలన్న పట్టుదలతో డ్రైవర్‌గా మారాను’ అని చెబుతుంది నీల్కమల్.
అక్కడి రోడ్లు.. మనదగ్గర ఉన్నట్టు సాఫీగా ఉండవు. ఆ దారుల్లో లెక్కలేనన్ని మలుపులు తారసిల్లుతాయి. ఎక్కే కొండలు, దిగే లోయలు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. వాహనం బోల్తా కొట్టడం ఖాయం. ఇంత రిస్క్ ఉన్నా.. నీల్కమల్ పట్టించుకోలేదు! అన్టైమ్ డెలివరీ ఇవ్వడమే తన కర్తవ్యంగా భావించింది. తెల్లారేసరికల్లా సురక్షితంగా లోడ్‌ను చేరవేసింది. అలా మొదటి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి అందరి ప్రశంసలూ అందుకుంది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఈ లేడీ డ్రైవర్‌ను చూసి మొదట్లో అందరూ ముక్కున వేలేసుకున్నారు. కొన్నాళ్లకు చప్పట్లు కొట్టి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా.. ఆమెను గౌరవంగా చూసుకునేవాళ్లు. హిమాచల్‌ప్రదేశ్ ట్రక్ అసోసియేషన్ అయితే.. ‘మన ఆడబిడ్డకు కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే’ అంటూ లారీడ్రైవర్లకు హుకుం జారీ చేసింది. ‘ట్రక్ నడపడం ఆషామాషీ వ్యవహారం కాదు. అర్ధరాత్రులు ప్రయాణం చేయాల్సి వస్తుంది. పైగా అప్పట్లో రోడ్లు భయంకరంగా ఉండేవి. ఒకసారి ఓ ఎత్తు మలుపు దగ్గర.. బండి పికప్ అందుకోలేదు. ముందుకు కదలకపోగా.. వెనక్కి వెళ్లసాగింది. మా మేనల్లుడు హుటాహుటిన దిగి.. వెనుక టైర్లకు అడ్డంగా రాళ్లు పెట్టడంతో బండి ఆగింది’ అని తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది నీల్కమల్.
ఆ దరిమిలా ఆమె ట్రక్ వెనక్కి మళ్లింది లేదు. స్టీరింగ్ స్ట్రక్ అయిందీ లేదు. ఎగుడుదిగుడు దారుల్లో దూసుకుపోతుందామె. దట్టంగా మంచు కురిసినా.. పక్కాగా సాగిపోయింది. బ్యాంకు రుణం తీర్చేసింది. కుటుంబ బాధ్యతలనూ సమర్థంగా నిర్వర్తిస్తున్నది. కొడుకును చక్కగా చదివిస్తున్నది. తల్లిదండ్రుల ఆలనాపాలనా కూడా చూసుకుంటున్నది. నీల్కమల్ చూపిన దారిలో ఇప్పుడు మరెందరో నడుస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనే దాదాపు డజను మంది ఆడపడుచులు భారీ వాహనాలను నడిపిస్తున్నారు. వాళ్లందరికీ దారి చూపిన ఘనత మాత్రం నీల్కమల్కే దక్కుతుంది.