ఉప్పునుంతల, జూలై 17 : పచ్చబడుతున్న తెలంగాణను చేసి ఓర్వలేక టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చిచ్చుపెడుతున్నాడని, రైతులు అతడిని బొందపెట్టాలని ప్రభుత్వవిప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. ఉప్పునుంతలలోని రైతువేదిక వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల ఉచిత విద్యుత్తు అందించి బీడువారిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తయారుచేస్తున్నారన్నారు. ఈక్రమంలో మూడుగంటల కరెంటు చాలన్న రేవంత్‌రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పేవరకు గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులను రానివ్వకూడదన్నారు. పిచ్చోడి మాటలకు సొంత పార్టీ నాయకులే అసహ్యించుకుంటున్నారన్నారు. అమెరికాలో మాట్లాడితే పెద్ద నాయకుడను అవుతానని పగటి కలలు కన్నారని ఎద్దేవా చేశారు. వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్ నాయకులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ రాక ముందు జిల్లాలో సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయారని, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతున్నదన్నారు.
రైతులు మూడు పంటలు పండిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణకు రేవంత్‌రెడ్డి వ్యతిరేకిగా ఉన్నారన్నారు. వరంగల్‌లో నిర్వహించిన సభకు రైపిల్తో వెళ్లి ప్రజలను గందరగోళానికి గురిచేశాడని విమర్శించారు. ఓట్ల కోసం ముసలి కన్నీరు కారుస్తూ వచ్చే కాంగ్రెస్ నాయకులను నమ్మొద్దని సూచించారు. నియోజకవర్గంలో రూ.2,300కోట్లతో ఉమామహేశ్వర, చెన్నకేశవస్వామి, మద్దిమడుగు ఆంజనేయస్వామి రిజర్వాయర్, నిరంజన్‌షావలీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఆమోదం లభించిందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు అవుతుంటే ఉప్పునుంతలలో ప్రతిపక్ష సర్పంచ్ అభివృద్ధిని అడ్డుకుంటూ కమీషన్ల కోసం తీర్మానం కాపీలు ఇవ్వడం లేదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరని, ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట మార్కెట్‌కమిటీ చైర్మన్ అరుణ, సింగిల్‌విండో చైర్మన్ భూపాల్‌రావు, పాలశీతలీకరణ కేంద్రం చైర్మన్ గోపాల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.