NDTV on Adani | కంపెనీ, దాని ఫౌండర్ల అనుమతి లేకుండానే తమ సంస్థను టేకోవర్ చేసేందుకు అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రయత్నిస్తున్నదని ఎన్డీటీవీ పేర్కొంది. ఎన్డీటీవీలో 55 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అదానీ మీడియా సంస్థ అదానీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ (ఎఎంఎన్‌ఎల్) మంగళవారం ప్రకటించింది. దీనిపై ఎన్డీటీవీ ఘాటుగా రియాక్టయింది. `ఎన్డీటీవీ ఫౌండర్ల సమ్మతి, సంప్రదింపులు లేకుండానే వీసీపీఎల్ సంస్థకు ఆఆర్పీఆర్ సంస్థలో గల వాటాలపై హక్కులను టేకోవర్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని ఎన్డీటీవీ ఫౌండర్లు, కంపెనీ తెలియజేస్తున్నది` అని ఎన్డీటీవీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
భారతీయ బిలియనీర్ గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ.. దేశంలోనే పేరొందిన టీవీ న్యూస్ సంస్థ ఎన్డీటీవీలో మెజారిటీ వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎన్డీటీవీలోని ఫైనాన్సియల్ రైట్స్‌ను ఉపయోగించుకుని ఆ సంస్థలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అదానీ అనుబంధ ఎఎంఎన్‌ఎల్ తెలిపింది. ప్రభుత్వ చట్టాల ప్రకారం ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటా కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది.
అదానీ గ్రూప్ ప్రకటనపై ఎన్డీటీవీ స్పందిస్తూ.. తమ సంస్థ, ఫౌండర్ల అనుమతి లేకుండానే అదానీ గ్రూప్ టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొంది. ఎన్డీటీవీ రియాక్షన్‌పై అదానీ గ్రూప్ ప్రతి స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిశిత విమర్శలు చేస్తున్న ఎన్డీటీవీ గ్రూప్‌కు మూడు జాతీయ టీవీ చానెళ్లు ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీల్లో 24×7 చానెళ్లు, ఒక బిజినెస్ న్యూస్ చానెల్ ఉన్నాయి.