Naveen Polishetty | తెలుగు సినిమా రంగంలో తనదైన స్టైల్‌తో దూసుకెళ్తున్న యువ నటుడు నవీన్ పోలిశెట్టి, “తక్కువ సినిమాలు – ఎక్కువ ప్రభావం” అనే విధానంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒక్కో సినిమా మధ్య ఎక్కువ విరామం తీసుకున్నా, వచ్చిన ప్రతీసారి ప్రేక్షకులను కొత్తదనంతో పలకరించడం అతని బలంగా మారింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో వినూత్నమైన క్రైమ్–కామెడీని పరిచయం చేసిన నవీన్, ‘జాతిరత్నాలు’తో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆపై ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని తన పరిధిని మరింత విస్తరించాడు.ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమైన ‘అనగనగా ఒక రాజు’పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా నవీన్ కనిపించనున్నాడు. ట్రైలర్లో కనిపించిన స్థానిక యాస, సహజమైన హాస్యం, టైమింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ తన కెరీర్ దృష్టికోణాన్ని స్పష్టంగా వివరించాడు. సినిమాల మధ్య గ్యాప్‌లపై వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా, ప్రేక్షకుడు థియేటర్లో పెట్టే ప్రతి రూపాయి విలువైనదేనని, అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. ముంబయిలో అవకాశాల కోసం తిరిగిన రోజుల్లో సినిమా చూడటానికీ డబ్బులు లేక ఇబ్బంది పడ్డ అనుభవాలు తనలో ఇప్పటికీ ఉన్నాయని, అప్పటి బాధే తనను ఇంకా బాధ్యతాయుతంగా ఆలోచించేలా చేస్తుందని తెలిపాడు.
తన మొదటి రోజుల గురించి మాట్లాడుతూ, నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు ఇంట్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, ముఖ్యంగా నాన్నతో జరిగిన చర్చలు కష్టంగా అనిపించాయని గుర్తు చేసుకున్నాడు. అవకాశాలు దొరకని సమయంలో ఆ ఒత్తిడి ఎక్కువైందని, కానీ ఆ దశలో అమ్మ తనకు అండగా నిలిచిందని భావోద్వేగంగా చెప్పాడు. “ఆమెనే నా ఎనర్జీ” అంటూ తల్లికి కృతజ్ఞతలు తెలిపాడు. సినిమాల విషయానికి వస్తే, ఎస్.ఎస్. రాజమౌళి, రాజ్‌కుమార్ హిరానీ, జోయా అక్తర్ లాంటి దర్శకులతో పనిచేయాలన్న కోరిక ఉందని చెప్పిన నవీన్, తనకు ప్రేరణనిచ్చే వ్యక్తులుగా ఎంఎస్ ధోనీ, లియోనెల్ మెస్సీలను ప్రస్తావించాడు. ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొనే వారి తత్వమే తనకు ఇష్టమని అన్నాడు. ఒక సినిమా ఒప్పుకున్నాక స్క్రిప్ట్ నుంచి డాన్స్ వరకు ప్రతి అంశంలో పూర్తిగా లీనమవుతానని, అదే సమయంలో పని మీద మునిగిపోవడం వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని దూరాలు పెరిగాయని కూడా నిజాయితీగా ఒప్పుకున్నాడు.