Pahalgam terror attack : భారత్ కు తానంటే భయమని పాకిస్తాన్ తీవ్రవాది, ఫహల్గాం దాడి సూత్రధారి, తీవ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయిబా అగ్రనేత సైఫుల్లా కసూరీ అన్నాడు. పాకిస్తాన్ లోని ఒక స్కూల్ లో జరిగిన కార్యక్రమానికి సైఫుల్లా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాడు. ఢిల్లీ దాడులకు సంబంధించి తాను చేసిన హెచ్చరికలపై ఇండియా ఇప్పటికీ తానంటే భయపడుతోందని సైఫుల్లా అన్నాడు.
ఈ సందర్భంగా సైఫుల్లా మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యాలు చేశాడు. ‘‘ఇండియాకు నేనంటే భయం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని టెర్రరిస్టు క్యాంపులపై ఇండియా దాడి చేసి పెద్ద తప్పు చేసింది. ఫహల్గాం దాడులకు నన్నే బాధ్యుడిని చేశారు. ఈ దాడితో నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మా సంస్థ లష్కర్ ఇ తొయిబా కాశ్మీర్ పై ఎప్పటికీ దృష్టి పెడుతుంది. కాశ్మీర్ మిషన్ నుంచి మేం ఎప్పటికీ తప్పుకోం. మాకు పాక్ సైన్యం నుంచి మద్దతు ఉంది. సైనికులు మాతో కలిసి పని చేస్తారు. సైన్యం చేపట్టే కార్యక్రమాలకు మమ్మల్ని రమ్మని పిలుస్తుంటారు’’ అని సైఫుల్లా వ్యాఖ్యానించాడు.
అతడి వ్యాఖ్యలతో ఫహల్గాం దాడిలో పాక్ పాత్ర మరోసారి బయటపడటంతోపాటు, అక్కడి తీవ్రవాదులకు సైన్యం సహకరిస్తుందనే విషయం మరోసారి రుజువైంది. ఎందుకంటే.. తమ దేశంలోని తీవ్రవాది శిబిరాల్ని అంతం చేశామని పాక్ ప్రకటించింది. కానీ, అందులో వాస్తవం లేదని సైఫుల్లా వ్యాఖ్యలతో రుజువైంది. ఇండియా గత ఏడాది మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.