సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల హక్కులను కాలరాసే విధంగా పరిపాలిస్తున్నదని దుయ్యబట్టారు. బియ్యం, పప్పు, వంటనూనెలు, కూరగాయలు తదితర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆహార భద్రత లేకుండా చేసిందని మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 28, 29న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం టీఆర్ఎస్కేవీ, టీయూసీ, ఐఎన్టీయూసీ వివిధ కార్మిక సంఘాల నాయకులతో సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 44 రకాల కార్మిక చట్టాలను సవరించిందని, 29 చట్టాలను పూర్తిగా రద్దుచేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాలను ఏకతాటి పైకి తెచ్చి దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. సమ్మెలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.