న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్(ఎన్సీహెచ్)కి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదని ఎన్సీహెచ్కి 3 వేల మంది ఫిర్యాదు చేశారంట. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే తెలిపారు. ప్రతిరోజు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇప్పటి వరకు మూడు వేలకు పైగా వచ్చాయని, వీటన్నింటిని సీబీఐసీ(కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు)కు సమర్పించినట్టు ఆమె చెప్పారు.
తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదిలీ చేయకుండా ఉండటానికి, తప్పుదారి పట్టించే డిస్కౌంట్ పద్దతులతో వినియోగదారులు మోసపోతున్నారని, వీటికి చెక్ పెట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు, అలాగే ఇందుకోసం త్వరలో నూతన టెక్నాలజీని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. పలు రంగాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, మోసానికి పాల్పడిన వారికి నోటీస్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.