హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : దేశ ఆర్థికవ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నెముక అయినప్పటికీ వినియోగదారుల(ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, దుకాణాలు, ప్రైవేటు వ్యక్తులు)నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు కాకపోవడం వాటి అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(జీఏఎంఈ) అంచనా ప్రకారం 2024లో ఎంఎస్ఎంఈలకు రావాల్సిన బకాయిలు రూ.10.7 లక్షల కోట్లని, అందులో సుమారు 80శాతం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల వాటా ఉందని చెప్పారు. ఈ సమస్యను పరిషరించకపోతే ఎంఎస్ఎంఈల ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఎంఎస్ఎంఈల బకాయిలపై వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలకు రావాల్సిన బకాయిల వసూళ్ల కోసం రూపొందించిన సమాధాన్ పోర్టల్‌లో ఇప్పటివరకు 2,54,360 కేసులు నమోదు కాగా, వాటిలో కేవలం 50,803 మాత్రమే పరిషరించబడినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలు మనుగడ సాగించాలంటే వేగవంతమైన, సమర్థవంతమైన పరిషార పద్ధతులు అవసరమని స్పష్టంచేశారు. పరిశ్రమలశాఖ సంయుక్త సంచాలకుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల పనితీరు గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాది ప్రదీప్‌రెడ్డి, ఎఫ్‌టీసీసీఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కృష్ణ, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.