రంగారెడ్డి : పార్మాసిటీకి ( Pharma City) వ్యతిరేకంగా జిల్లాలోని కురమిద్ద గ్రామం మర్లకుంట తండాలో రైతులు చేపట్టిన దీక్షలు 42 రోజులకు చేరుకున్నాయి. జాతీయ మహిళా రైతుల హక్కుల వేదిక సభ్యులు ( National Committee Members) ఆశలత , పిలుపు స్వచ్చంద సంస్థ అధ్యక్షులు జనార్దన్ , చైతన్య మహిళా సంఘం సభ్యులు గిరిజ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు మాట్లాడుతూ ఫార్మాసిటీ కోసం భూసేకరణను గత 8 ఏళ్లుగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగా రెడ్డి పాదయాత్ర నిర్వహించి రైతులకు మద్దతు తెలిపి భూములు ఎట్టి పరిస్థితిలో ఫార్మాసిటీకి ఇవ్వవద్దని చెప్పారని గుర్తు చేశారు.
అధికారం లోకి వస్తే భూసేకరణ రద్దు చేసి భూములు కాపాడుతామని, ఫార్మా సిటీ రద్దు చేస్తామని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాక భూమి ఇయ్యాల్సిందే లేకుంటే గుంజుకుంటాం అని పోలీసులని పెట్టి బేదిరిస్తున్నారని వాపోయారు. ఫార్మా సిటీ రైతుల ఉద్యమానికి తమ సంస్థల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురమిద్ద సర్పంచ్ శ్రీవిద్య, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మర్ల కుంట, మంగళ్గడ్డ, పోతూబండ తండా, కురమిద్ద రైతులు పాల్గొన్నారు.