Jani Master | న్యూఢిల్లీ: ఇప్పటికే లైంగిక దాడి ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం గతంలో అతనికి ఇచ్చిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్టు అవార్డుల కమిటీ ప్రకటించింది. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2022లో తిరుచిత్రబలం చిత్రానికి అతనికి ప్రదానం చేసిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది.
అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. కాగా, ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించి, ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.