హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వాటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే రహదారి పనులు, రూ.2,360 కోట్లతో జహీరాబాద్‌లో చేపట్టనున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఉన్నాయి.
రూ.610 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్, రూ.1,243 కోట్లతో కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను, రూ.1,700 కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్, రూ.300 కోట్లతో నిర్మించిన అండర్ రైల్ బైపాస్ లైన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న ఆయనను పరామర్శించారు. అక్కడి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. బాబుతో దాదాపు గంటకుపైగా భేటీ అయ్యారు. భేటీ తర్వాత తన పర్యటన విశేషాలను మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిసినట్లు తెలిపారు. చంద్రబాబు, పవన్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. ప్రసంగం ముగిసిన అనంతరం నేరుగా బేగంపేటలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గుజరాత్‌కు ప్రయాణమయ్యారు. ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానం, వీడ్కోలు పలికారు.