‘ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువు పూర్తి చేసుకొని బయటకొచ్చాక.. మళ్లీ ఆ స్కూల్, కాలేజీలో అడుగుపెట్టినవాళ్లు ఎంతమంది ఉంటారు? మనం ప్రతీది ప్రభుత్వం నుంచి పొందాం. మరి మనం ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను వినియోగించుకుని ఎదిగాం కదా! మరి మనం ప్రభుత్వ పాఠశాలలకు ఏం చేయగలుగుతున్నాం?’ అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటారు నరేంద్ర కుమార్ కామరాజు. తమ ట్రస్ట్‌ను సంప్రదించాలనుకుంటే 73372 52627 నంబర్‌కు కాల్ చేయవచ్చని పేర్కొంటున్నారు.
నిరుపేద విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ.. వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో రాణించాలంటే చదువే కీలకమని నమ్మిన వ్యక్తి ఆయన. ఆర్థిక సమస్యతో ఆ చదువు నిరుపేద విద్యార్థుల నుంచి దూరం కావొద్దనే తపనపడే మనిషి. అందుకే తన చిన్నప్పుడు ‘మనకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాల’ని నాయనమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు అతని సేవా కార్యక్రమానికి ప్రేరణనిస్తున్నాయి. ఇప్పటి వరకు నగరంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్పోర్ట్ షూస్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
పదో తరగతిలో 500 మార్కులు దాటిన ఆయా స్కూళ్లకు చెందిన 43 మంది విద్యార్థులకు తన నాయనమ్మ పేరుమీద ఏర్పాటు చేసిన కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తూ మొత్తంగా రూ.21లక్షలు ప్రకటించారు. అయితే ఈ స్కాలర్షిప్ సాయం ప్రతీ ఏడాది కొనసాగనుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానకెత్తుకున్న ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ట్రస్ట్ కార్యక్రమాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
నిరుపేద విద్యార్థుల కష్టాలు నాకు తెలుసు. నా చిన్నతనంలో నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. చదువుకోవడానికి రోజు రామాంతపూర్ నుంచి కోఠికి బస్సులో వెళ్లేవాణ్ని. అక్కడ్నుంచి నయాబజార్ ప్రభుత్వ పాఠశాలకు రెండున్నర కిలోమీటర్లు నడిచేవాణ్ని. మా స్కూల్ పొద్దున తెలుగు మీడియం, మధ్యాహ్నం మరాఠీ మీడియం. ఉదయం 8 నుంచి 12 వరకు తెలుగు మీడియం. ఉదయం ఫర్వాలేదు కానీ, మధ్యాహ్నం పూట బస్సులు ఉండేవి కావు. ఇంటికొచ్చేసరికి సాయంత్రం 3, 4 గంటలు అయ్యేది. చాలా అలిసిపోయేవాళ్లం. అందుకే నేను సాయం చేయాలనుకున్నప్పుడు నేనెక్కడ కష్టాలు ఎదుర్కొన్నానో అక్కణ్నుంచే పరిష్కార మార్గం చూపించాలని నిర్ణయించుకున్నాను.
సాధారణంగా చాలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బ్యాగులు సరిగా లేక, చెప్పులు లేకుండా, యూనిఫాం చిరిగిపోయి తారసపడుతుంటారు. వారి చదువు కష్టాలతోనే కొనసాగుతుంది. అలాంటి పిల్లలను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి వారి జీవితాలు మారాలంటే విద్యతోనే సాధ్యం. అందుకే బాగా చదివే విద్యార్థుల ప్రతిభ ఆర్థిక కారణాలతో నిలిచిపోవద్దు. మనవంతు సాయం అందిస్తే వారు సమాజానికి ఉపయోగపడే శక్తులవుతారని నమ్మాను.

నేను కూడా నా ఉన్నత చదువు ట్రస్ట్ సాయంతోనే పూర్తి చేశాను. నేను ఇంజినీరింగ్ జేఎన్టీయూలో చదివాను. మా అన్నయ్య కేవీఎస్ నర్సింగ్ రావు నాకు అండగా నిలబడ్డాడు. కన్స్ట్రక్షన్ సైట్లో రెండేండ్లు సూపర్వైజర్గా కూడా పనిచేశాను. ఇంజినీరింగ్ పూర్తయ్యాక రైల్వేలో జాబ్ చేశాను. అనంతరం సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్లాను. ఇన్ఫోసిస్, టాటా, ఒరాకిల్‌లో పనిచేశాను. 2007లో ప్రణీత్ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేశాను.
ఇలా అంచెలంచెలుగా సాగిన నా ప్రస్థానంలో మా నాయనమ్మ తరుచూ నాతో చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. నా తొలి జీతం మూడువేల రూపాయలు వచ్చినప్పుడు కూడా అందులో 300 రూపాయలు సాయం చేసేవాణ్ని. అన్నపూర్ణమ్మ ట్రస్ట్‌తో స్కాలర్‌సిప్‌లు ఇవ్వడమే కాదు ఇప్పటి వరకు 250 మంది విద్యార్థులను ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివించాను. ఇలా సాయం అందుకున్న విద్యార్థులు చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఓ విద్యార్థి అమెరికాలో స్థిరపడ్డారు. అతను మన ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తనవంతు సాయం అందించాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉండరు. ఆ సమస్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే మాకు సాధ్యమైనంత వరకు సంబంధిత పాఠశాలల్లో మంచి టీచర్లను నియమించే బాధ్యత తీసుకుంటున్నాం. వారికి మా ట్రస్ట్ జీతాలు చెల్లిస్తుంది. చాలామంది హెచ్ఎంలు తమ పాఠశాలల్లో టీచర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకే మేం సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని, వారి సూచనలతో టీచర్ల నియామకానికి ప్రణాళికలు చేశాం. ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది. చదువు లేకున్నా సాధించేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, చదువు ఆయుధం లాంటిదని నేను బలంగా నమ్ముతున్నాను. మహా అయితే 15 ఏండ్లు చదువుతామేమో.. ఆ తర్వాత జీవిత పోరాటమే. అందుకే ఆ చదువు ఫౌండేషన్ బలంగా ఉంటే విద్యార్థులు గొప్పగా రాణిస్తారు.
సహాయం, సేవ చేయాలనే ఆలోచన నేను మా నాయనమ్మ నుంచే నేర్చుకున్నాను. మా నాయనమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఆమెది తన వద్ద ఉన్నదాంట్లో కొంత సాయం చేసే మనస్తత్వం. సాయం చేయాలనే మనస్తత్వం ఉంటే డబ్బే కాదు.. ఏ రూపంలోనైనా సాయం అందించగలం అని చెబుతుండేది. పదిమందికీ సాయం చేసే ఆలోచన నాలో నాటుకుపోయేలా చిన్నప్పటి నుంచి నూరిపోసింది. ఏడో తరగతి వరకు నన్ను ఎత్తుకుని ముద్దాడేది. నీ గురించే కాదు.. నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించమని చెబుతూ ఉండేది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా ట్రస్ట్ కార్యకలాపాలకు ప్రేరణ మా నాయనమ్మే! ఈ సేవలు మరింత విస్తృతంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది.