మక్తల్ : కొడంగల్ ( Kodangal ) నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొస్తానని నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) ఆరోపించారు. గురువారం మక్తల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో బీమా ఫెస్ వన్ అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి నీటిని ఏ విధంగా తీసుకువెళ్తారో రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బహిరంగంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలని డిమాండ్ చేశారు. మక్తల్ మండలంలో ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ 1.3 టీఎంసీ సామర్థ్యం ఉంటే రిజర్వాయర్ నుంచి కొడంగల్‌కు 90 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా ఒక టీఎంసీ నీటిని కొడంగల్‌కు ఏ విధంగా తీసుకెళ్తారో సీఎం వివరించాలన్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు డీపీవో రిపోర్టులు, ఫారెస్ట్ క్లియరెన్స్, భూ సేకరణ , కృష్ణ బోర్డు నుంచి అనుమతులు ఏమాత్రం లేకుండా ప్రాజెక్టు ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్ష్ట్రక్షన్ టెండర్లు దక్కించుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే పైపుల నిర్మాణం చేపట్టామంటూ 100 కోట్ల బిల్లు ఏ విధంగా పెట్టుకుంటారని, ఆరోపించారు.
ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండానే వంద కోట్ల బిల్లులు
ప్రాజెక్టు పనులకు ఎలాంటి అనుమతులు లేకుండా ముందస్తుగానే వంద కోట్ల బిల్లు పెట్టడానికి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని అన్నారు. నీటిని తీసుకువెళ్లేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టడం కోసం అధికారులు తమ వెంబడి పోలీస్ బలగాలను వేసుకువెళ్లి రైతులను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కచ్చితంగా భూసేకరణ చేసే విధానాన్ని అఖిలపక్ష సమావేశాన్ని ( All-party meeting ) పెట్టి బహిరంగంగా రైతన్నలకు మార్కెట్ విలువ ప్రకారంగా పరిహారం చెల్లిస్తే తప్ప ప్రాజెక్టును నిర్మాణానికి సహకరించబోమని హెచ్చరించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మక్తల్ నియోజకవర్గం లోని నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాలకు సాగునీరు చాలా ఇబ్బంది అవుతుందన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ లో చుక్క నీరు లేకున్నా కొడంగల్ నియోజకవర్గానికి నీటిని ఏ విధంగా తరలిస్తారో ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలనీ డిమాండ్ చేశారు. రిజర్వాయర్ల పై, నీటి సరాఫరా ఎలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రి తో పాటు ఎమ్మెల్యేలకు రిజర్వాయర్ల పరిస్థితి ఏమాత్రం అర్థం కాదని అన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మాజీ జడ్పీటీసీలు అరవింద్, అశోక్ గౌడ్, నర్వ మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, నాయకులు అన్వర్ హుస్సేన్, గాల్ రెడ్డి, జట్ల శంకర్, నరసింహారెడ్డి, కృష్ణ, మన్నన్, జుట్ల సాగర్, శివారెడ్డి, అశోక్ గౌడ్, బాలప్ప తదితరులు ఉన్నారు.