Immortality | న్యూఢిల్లీ: మనిషికి అమరత్వం సాధ్యమేనా? ఈ ప్రశ్న కొన్ని వందల ఏండ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలను ఒక్కచోట నిలువనీయలేదు. శాస్త్రీయంగా మాత్రం మనిషికి అమరత్వం సాధ్యమని ఎవరూ చెప్పలేకపోయారు. తాజాగా ఓ ఇంజినీర్ మనిషికి త్వరలో అమరత్వం లభిస్తుందని చెప్తున్నారు. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు 75 ఏండ్ల గూగుల్ మాజీ ఇంజినీర్ రే కర్జ్‌వీల్. ఈయన 147 అంచనాలు వేయగా ఇందులో 86 శాతం నిజం కావటంతో ఇప్పుడు అమరత్వం వాదనకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.
జెనెటిక్స్, నానోటెక్నాలజీ, రోబోటిక్స్ తదితర అత్యాధునిక సాంకేతికతలతో మరో ఏడేండ్లలోనే మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని తన యూట్యూబ్ చానల్ అడాజియోలో పోస్ట్చేసిన వీడియోలో రే వెల్లడించారు. వయసును రివర్స్ చేయగలిగే నానోబోట్లను నానోటెక్నాలజీ, రోబోటిక్స్ అభివృద్ధి చేస్తాయని, ఇవి వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో దెబ్బతినే కణాలు, కణజాలాలను పునరుద్ధరిస్తాయని, రోగ నిరోధక శక్తిని కల్పిస్తాయని ఆయన అంచనా వేశారు. వయసు మీద పడకుండా చేసే ఈ నానోబోట్ల వల్ల మనిషికి అమరత్వం సాధ్యం అవుతుందని ఆయన చెప్తున్నారు.
Ray Kurzweil
తనను తాను భవిష్యత్తువాదిగా చెప్పుకునే కర్జ్‌వీల్ గతంలో ఇలాగే వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ప్రపంచ అత్యుత్తమ చెస్ ప్లేయర్‌ను కంప్యూటర్ ఓడించగలదని 1990లో ఆయన అంచనా వేయగా అది 1997లో నిజమయ్యింది. 2023 నాటికి వెయ్యి డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌కు మనుషుల మెదడుకు ఉన్నంత శక్తిసామర్థ్యాలు ఉంటాయని కర్జ్‌వీల్ 1999లో అంచనా వేశారు. 2010 నాటికి ప్రపంచమంతా హై బ్యాండ్‌విడ్త్ వైర్లెస్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని చాలా ఏండ్ల క్రితమే చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి కర్జ్‌వీల్ అంచనాలు చాలా వరకు నిజం అవ్వడంతో ఆయన మాటకు ప్రాధాన్యం, నమ్మకం పెరిగాయి. దీంతో ఇప్పుడు మనిషికి చావు ఉండదనే ఆయన అంచనాపై అందరి దృష్టి పడింది.