భువనేశ్వర్: ఒడిశా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఇవాళ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే మహాభారతంలోని ఫేమస్ ద్రౌపది క్యారెక్టర్ పేరును స్కూల్ టీచర్ తనకు పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఒడియా వీడియో మ్యాగ్జిన్‌కు కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సంతలి సంస్కృతి ప్రకారం తనకు పుతి అనే పేరును పెట్టారని, కానీ ఆ పేరును తన స్కూల్ టీచర్ ద్రౌపదిగా మార్చినట్లు ఆమె గుర్తు చేశారు. ద్రౌపది తన ఒరిజినల్ పేరు కాదు అని, ఆ పేరును టీచర్ పెట్టిందని, మరో జిల్లాకు చెందిన టీచర్ తనకు నామకరణం చేసిందని, ఆమె మయూర్బంజ్ జిల్లాకు చెందిన టీచర్ కాదు అని ముర్ము తెలిపారు.
మయూర్బంజ్ జిల్లాలో ఎక్కువగా ఆదివాసీలే ఉంటారు. అక్కడికి బాలాసోర్, కటక్ నుంచి టీచర్లు వచ్చేవారని, 1960 దశకంలో అలా ఉండేదని ముర్ము అన్నారు. తనకు ఉన్న పాత పేరు తన టీచర్‌కు నచ్చలేదని, తన మంచి కాంక్షించిన ఆమె తన పేరును మార్చినట్లు ముర్ము చెప్పారు. దుర్పది, దొర్పది అని కూడా పేర్లు మారుతూ వచ్చాయన్నారు. సంతలి తెగలో ఎవరైనా అమ్మాయి పుడితే, వాళ్లకు అమ్మమ్మ పేరును పెడుతారని, ఒకవేళ కొడుకు పుడితే వాళ్లకు తాతయ్య పేరు పెడుతారని ముర్ము తెలిపారు. ద్రౌపది ముర్ముకు తాను చదువుకునే రోజుల్లో స్కూలు, కాలేజీ రికార్డ్స్‌లో తుడు ఇంటిపేరు ఉంది. అయితే బ్యాంక్ ఆఫీసర్ శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటి పేరు ముర్ముగా మారింది.