హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో జలపాఠాలు నేర్చుకోవచ్చని మహారాష్ట్ర జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ సంజయ్ బల్సారే ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుత కుడ్యమని, దీనిని పరిశీలించిన తర్వాత అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని అత్యంత స్వల్పకాలంలోనే పూర్తిచేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఎంతో దీ క్ష, పట్టుదల, సమర్థ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అ భినందించారు. మహారాష్ట్ర అధికారుల బృందం కాళేశ్వరంను సందర్శించిన సందర్భంగా ఆదివారం ఆయ న ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ముఖ్య కారణం ఏమిటి?
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా ఖ్యాతి పొందింది. మొదట్నుంచీ ఈ ప్రాజెక్టు గురించి వింటున్నాం. నేషనల్ మీడియాలో ఎన్నో ప్రత్యేక కథనాలొచ్చాయి. అంతగొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని భావించాం. నిర్మాణంలో వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేయాలనుకొన్నాం. అందుకే 15 మంది అధికారుల బృందంతో వచ్చాం. రెండ్రోజులుగా ప్రాజెక్టులో భాగమైన వివిధ కాంపొనెంట్లను పరిశీలించాం. మేడిగడ్డ, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్‌తో పాటు పంప్‌హౌస్‌లు, సర్జిపూల్స్ చూశాం. ఎన్నో కొత్త విషయాలు, ఆసక్తికర అంశాలను గుర్తించాం.
ప్రాజెక్టుపై మీ అభిప్రాయం?
కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుత కుడ్యం. ఇంతపెద్ద ప్రాజెక్టును అతి స్వల్ప కాలంలోనే నిర్మించడం గొప్ప విషయం. ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడమంటే వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అటవీ, రెవెన్యూ, విద్యుత్తు లాంటి శాఖలన్నింటినీ ఏకకాలంలో సమన్వయం చేసుకొని, మూడేండ్లలోనే నిర్మించడమంటే మాటలు కాదు. ఎంతో గొప్ప సంకల్పం, సమర్థుడైన నాయకుడు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. తెలంగాణ సర్కారు జల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు.
కాళేశ్వరం నిర్మాణంలో మీరు గమనించిన అంశాలేమిటి?
నిర్మాణం మొదలు నిర్వహణ వరకూ ప్రతి ఘట్టం ఒక అద్భుతం. వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం, నిర్మించిన తీరు అజరామరం. బాహుబలి మోటర్లు, సొరంగమార్గాలు, కాలువలు, రిజర్వాయర్లు, సర్జ్‌పూల్స్ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంతే సంక్లిష్టతతో కూడుకున్నవి. దేశంలో ఇప్పటివరకు ఎక్కడాలేని విధంగా ఈ-టెక్నాలజీ దన్నుతో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహణకు సన్నాహాలు చేస్తుండటం మరో విశేషం. అందుకు అనుగుణంగా రూపొందించిన సాఫ్ట్వేర్, మొబైల్ యాప్‌లు బాగున్నాయి. పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాలువలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్‌ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి తదితర సమస్త సమాచారమంతా ఒకేచోట లభించడం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో పరిమాణాన్ని అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిస్టమ్‌లో పొందుపరచడం, జలాశయాలు, చెరువుల్లో ఎంత నీరు ఉన్నది? ఎంత ఖాళీ ఉన్నది? అన్న సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకొనే అవకాశముండటం గొప్ప విషయం.
మానవ నిర్మిత జలాశయం మల్లన్నసాగర్‌ను సందర్శించారు. ఎలా ఉన్నది?
మల్లన్నసాగర్ పూర్తిగా ఆఫ్‌లైన్ జలాశయం. అంటే నదిపైకానీ, చిన్నవాగుపై కానీ నిర్మించని జలాశయం. ఈ మానవనిర్మిత ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నదులపై కట్టిన ప్రాజెక్టుల్లో పూడిక పెరిగిపోతున్నది. దానిని తొలగించడం అసాధ్యం. ఒకవేళ సాధ్యమైనా అత్యంత ఆర్థికభారం. ఆ సమస్యకు ఏకైక పరిష్కారం మానవనిర్మిత జలాశయాలే. ఇప్పుడు యావత్ ప్రపంచం ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్మించడం అభినందనీయం. మానవనిర్మిత జలాశయాలను నిర్మించడం అంత తేలికేమీ కాదు. ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. అణువణువునూ పరిశీలించాల్సి ఉంటుంది. రిజర్వాయర్‌ను నీటితో నింపిన విధానం, కట్టల భాగమైన ఇనుప ఫిల్లర్లు, మెటల్ ఫిల్లర్లు, రాతి కట్టడాలు, డ్రెయిన్ సిస్టమ్ పనితీరు బాగున్నది. నాణ్యతాప్రమాణాలనూ పక్కాగా పాటించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ జలసంరక్షణ చర్యలు ఆదర్శంగా నిలుస్తాయి. ఎక్కడా ఒక్కచుక్క కూడా వృథా కాకుండా ప్రాజెక్టులను డిజైన్ చేశారు. అందుకు మల్లన్నసాగర్ రిజర్వాయరే ఉదాహరణ. ఎక్కడయినా వాగుల ద్వారా రిజర్వాయర్లలో నీళ్లు చేరుతుంటాయి. కానీ ఇక్కడ రిజర్వాయర్ నుంచే వాగుకు నీరు చేరేలా ప్రాజెక్టును రూపొందించడం చూసి ఆశ్చర్యపోయాం. వాగుకు సమాంతరంగా, సమీపం నుంచి డ్యామ్ నిర్మించారు. రిజర్వాయర్ సీపేజ్ వాటర్‌ను వాగులోకి చేర్చడం మహాద్భుతం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో జలపాఠాలను నేర్చుకోవచ్చు.