‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
“అమ్మగారూ..”రాజమ్మ పిలుపుతో, చేనంతా కలియ చూస్తున్న జానకమ్మ ఉలిక్కిపడింది.
“ఈ మిరప చేను మాదే అమ్మగారూ! అరెకరం ఉంటది. మిర్చి ఏరడానికి కూలి మడుసులు దొరుకుతలేరు. అందరి తోటలు ఇప్పుడే కోతకొస్తయి కదా! గందుకని కైకిలికి కొద్దిమందే దొరికిండ్రు” అన్నది రాజమ్మ.
మిరప తోటలో ఎర్రగా పండిన మిరపపండ్లు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఊరికి దగ్గరలోనే ఉన్నది ఆ చేను.
“ఏం పని లేకుండ, ఇంటికాడ ఉత్తగనే కూసుంటే ఏం తోస్తది అమ్మగారూ! పాత ఇసయాలన్నీ యాదికొచ్చి గుబులైతుంటది. జర గిట్ల అటు, ఇటు తిరుగుతా ఉంటే మదికి కాస్త ఊరట వస్తది. గందుకనే నిన్ను ఇక్కడికి తోలుకొచ్చిన” అన్నది రాజమ్మ.
లింగాపురం చిన్న గ్రామం. ఒంపు వీధిలో జానకమ్మ ఇంటి ఎదురుగానే రాజమ్మ ఇల్లు, ఆమె బంధువుల ఇళ్లు ఉన్నాయి. జానకమ్మ వాళ్లు శ్రీవైష్ణవులు. వాళ్ల తాతల కాలం నుంచి గుడి పూజారులుగానే బతికారు. జానకమ్మ మామగారు తిరువెంగళాచార్యులు. మహా పండితుడు, వేదాధ్యయనం చేసినవాడు. రజాకార్ల హడావుడికి ముందు, పక్కూరి వెంకట్రామిరెడ్డి దొర తిరువెంగళాచార్యుల పాండిత్యానికి మెచ్చి, తమ ఊరి ఆలయానికి అర్చకుడిగా ఉండమని ఆహ్వానించాడు. కానీ, తిరువెంగళాచార్యులు తమ స్వగ్రామమైన లింగాపురం విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందువల్ల వెంకట్రామిరెడ్డి దొర, లింగాపురంలోనే వరదరాజ స్వామి గుడి కట్టించి ఇచ్చాడు.
రజాకార్ల కారణంగా జనజీవనంలో బాగా అస్తవ్యస్తత ఏర్పడటంతో దాని ప్రభావం తిరువెంగళాచార్యుల కుటుంబం పైన కూడా పడింది.
అతని కుమారుడైన వరదాచార్యులు కూడా తండ్రితోపాటు గుడికి వెళ్లేవాడు. అలా వెళుతూ అర్చకత్వం, పౌరోహిత్యం నేర్చుకున్నాడు. ఆ ఊరిలో శ్రీవైష్ణవుల కుటుంబాలు, బ్రాహ్మణుల కుటుంబాలు మరో నాలుగు ఉన్నాయి.
కాలక్రమేణా దొర ఏర్పాటు చేసిన గుడిమాన్యం, ఊరి రాజకీయాలలో హరించుకుపోయింది. తిరువెంగళాచార్యుల అనంతరం వరదాచార్యులు అర్చకత్వానికి వచ్చేసరికి.. గుడికి వచ్చే ఆదాయం శూన్యమైపోయింది. గుడిలో రోజూ దీపం ముట్టించాలన్నా.. వరదాచార్యులే తన చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరదాచార్యులకు జానకమ్మతో వివాహం జరిగిన తర్వాత, కుటుంబ జరుగుబాటే కష్టమైపోయింది. గుడి అర్చకత్వంతోను, పౌరోహిత్యంతోను, ఒక కుటుంబం జీవించగలగడం చాలా కష్టమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈలోగా కొడుకు వెంకటాచార్యులు, కూతురు గోదాదేవి జన్మించారు.
“ఏమండీ! ఈ అర్చకత్వంతో మనం బతకడం, పిల్లలను చదివించుకోవడం కష్టం అవుతూ ఉంది కదండీ. మన ఊర్లో ఉన్న మన బంధువులు, బ్రాహ్మణ కుటుంబాలు కూడా పట్నానికి వలస పోతున్నారు కదండీ. మనం కూడా పట్నానికి వెళ్లి బతుకుదెరువు వెతుకుందామండీ” అంటూ బతిమిలాడింది జానకమ్మ.
“ఈ వరదరాజ స్వామి గుడి, అర్చకత్వం మా తండ్రిగారి కోరిక మేరకు మన కుటుంబానికి లభించిన అదృష్టం. ఇదంతా వదిలేసి, ఇప్పుడు అర్ధంతరంగా వెళ్లిపోతే ఆయన ఆత్మ శాంతిస్తుందంటావా జానకీ ” అన్నాడు వరదాచార్యులు.
“ఆత్మల శాంతికోసం ఆలోచిస్తే, మన ఆత్మారాముడు ఎలా శాంతిస్తాడండీ? పిల్లలకు రెండు పూటలా కడుపునిండా తిండి పెట్టుకోవాలి కదా? పట్నంలో ఏదో ఒక పని చేసుకొని బతకవచ్చు. ఈ ఊర్లోనే ఉంటే.. అయ్యగార్లుగా, పూజారి కుటుంబీకులుగా మనకు కూలి పనికూడా దొరకదు. కాస్త పిల్లల మొహం చూసి ఆలోచించండి. అంతా బాగుంటే మళ్లీ ఇక్కడికే వచ్చేద్దాం” అంటూ నచ్చచెప్పింది జానకమ్మ.
మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా తలపంకించాడు వరదాచార్యులు. జానకమ్మకు అదే పరమ సంతోషం. పట్నం వెళ్లడానికి సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. మర్నాడు ఉదయం జానకమ్మ.. మామగారైన తిరువెంగళాచార్యుల పటం తీసి తుడుస్తూ ఉంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
“అమ్మగారూ.. అమ్మగారూ! అయ్యగారు గుడిలో పడిపోయిండు. ఎంత పిలిచినా పలుకుతలేడు” గట్టిగా అరిచి చెప్పాడు ఆ వ్యక్తి.
ఈ అరుపులకు, అలికిడికి రాజమ్మ బయటికి వచ్చింది.
“ఏమైందిరా మల్లిగా! అయ్యగారికి ఏమైంది?” అడిగింది రాజమ్మ.
“ఏమోనత్తా! గంట కొట్టుకుంటా కొట్టుకుంటా గట్లనే పక్కకు ఒరిగిపోయిండు. ఎంత పిలిచినా పలుకుతలేడు” అన్నాడు మల్లిగాడు.
“అమ్మగారూ పద.. పొయ్యి చూద్దాం” అంటూ జానకమ్మను తీసుకొని వెళ్లింది రాజమ్మ.
గుడిలో అచేతనంగా పడి ఉన్నాడు వరదాచార్యులు. రాజమ్మ మల్లిగాణ్ని పంపించి, ఆ ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టరును పిలిపించింది.
డాక్టర్ వచ్చి పరీక్షించాడు.
“ఇది పక్షవాతం స్ట్రోక్ లాగా ఉన్నదమ్మా ! పక్కూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోండి” అని చెప్పి వెళ్లిపోయాడు.
రాజమ్మ తన భర్తను పిలిపించి, బండి కట్టించి.. అయ్యగారిని పక్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. జానకమ్మ అంటే రాజమ్మకు చాలా ఇష్టం. ఇద్దరూ దాదాపు ఒకే ఈడువారు. దాదాపు ఒకే సంవత్సరం పెళ్లయి అత్తగారింటికి వచ్చారు. ఆ ఇద్దరి మధ్య స్నేహం బాగా అల్లుకుపోయింది. జానకమ్మ శ్రీవైష్ణవుల ఇంటిపిల్ల కాబట్టి.. రాజమ్మ ఆమెను ఎప్పుడూ గౌరవంగా ‘అమ్మగారూ’ అని పిలిస్తే.. జానకమ్మ ఆప్యాయంగా ‘రాజమ్మా!’ అని పిలిచేది.
రాజమ్మ సహకారంతో వరదాచార్యులకు చికిత్స చేయించింది జానకమ్మ. అతనికి పక్షవాతం అని డాక్టర్లు చెప్పారు. మంచంలో ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్న చెట్టంత మనిషిని చూస్తుంటే గుండెలు ఆర్చుకుపోతున్నాయి జానకమ్మకు. ఇంట్లో తిరుగుతున్న ఇద్దరు చిన్నపిల్లలను చూస్తూ ఏం చేయాలో, జీవితాన్ని ఎలా గడపాలో తెలియక దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. కొడుకు వెంకటాచార్యులకు తండ్రితో గడిపిన కొద్దికాలం ఒక కలగానే మిగిలిపోయింది. వెంకటాచార్యుల చిన్నతనంలో వరదరాజస్వామి ఆలయ పూజా విధానం, ఇప్పటికీ అతని కనుల ముందు కదులుతూ ఉంటుంది. ఆ జ్ఞాపకాలు అతనికి అమృత తుల్యాలు అయ్యాయి.
జానకమ్మ, వెంకటాచార్యులను ప్రాతఃపూర్వమే నిద్రలేపి, స్నానం చేయించి, చిన్న పట్టు వస్త్రం పంచెగా కట్టేది. తిరువణి, శ్రీ చూర్ణంతో నామాలు తీర్చిదిద్దేది. ఆ చిన్ని బాలుడు ముగ్ధ మోహన రూపంతో ముద్దుగా గోచరించేవాడు. మార్ఘళి మాసం నెల రోజులూ, చలికి వణుకు పుడుతున్నా.. దైవ ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది వెంకటాచార్యులకు.
జానకమ్మ తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానాదులు కానిచ్చి, దేవుడికి తిరువళిక ముట్టించి, కట్టె పొంగలి వండేది. దాన్ని నైవేద్య పాత్రలో ఉంచి, మరో పూజా పాత్రలో తులసి తీర్థం ఉంచి, ఆ రెండూ ఒక పళ్లెరంలో ఉంచి, పైన పట్టు వస్త్రం కప్పి తయారుచేసేది జానకమ్మ.
వరదాచార్యులు తయారై వచ్చి, ఆ పళ్లెరాన్ని తీసుకొని.. ‘శ్రియః కాంతాయ కల్యాణ నిధయే నిధయేర్థినాం..’ అంటూ దైవధ్యానం చేస్తూ గుడివైపు నడుస్తూ వెళ్లేవాడు. అతని వెనకాలే చిన్ని వెంకటాచార్యులు చేతిలో తీర్థ కలశం పట్టుకుని తండ్రిని అనుసరిస్తూ వెళ్లేవాడు. వరదాచార్యులు తిరుప్పావై పారాయణం చేస్తూ గుడివైపు నడుస్తూ ఉంటే, దారిలో అతనికి ఎదురైన వారు ఆ పూజారికి నమస్కరించి పక్కకు జరిగేవారు. ఆ అయ్యగారిని సాక్షాత్తూ దేవుడిగా భావిస్తూ నమస్కరించే వారిని చూస్తూ ఉంటే వెంకటాచార్యుల మనసులో పులకింత కలిగేది.
గర్భగుడిలోకి వెళ్లిన వరదాచార్యులు, సాలగ్రామాన్ని శుద్ధిచేసి తీర్థంతో సంప్రోక్షణ చేసేవాడు. పుష్పాలు, గంధం, అక్షతలు సమర్పించి పూజ చేసేవాడు. కర్పూర హారతి వెలిగించి, పెరుమాళ్లకు హారతి పట్టేవాడు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చేవాడు వరదాచార్యులు. భక్తులు భగవంతునికి నమస్కరించి, పూజారికి కూడా పాదాభివందనం చేసేవారు. పూజారి అక్షతలు చల్లి ఆశీర్వచనాలు పలికేవాడు. ఆ సందర్భంలో ఆ భక్తులలో కనిపించే గౌరవ మర్యాదలు చూస్తున్న వెంకటాచారికి, తన తండ్రి ఎంతో గొప్పవాడని, సాక్షాత్తూ భగవంతుడే అన్న తలంపు కలిగేది. తాము ఎంతో గొప్పవాళ్లం కాబట్టే, అలా గౌరవిస్తున్నారని భావన కలిగేది.
కానీ, పక్షవాతం వచ్చి మంచాన పడిన తండ్రిని చూస్తూ ఉంటే.. అమ్మ కూలికి వెళ్లి తెచ్చిన జొన్న గటకతో కడుపులు నింపి, ఆకలి తీర్చుకుంటూ ఉంటే.. జీవితంలో మరోకోణం కూడా ఉంటుందని వెంకటాచార్యులకు అర్థమైంది.
శోక సముద్రంలో మునిగిపోయి ఉన్న జానకమ్మను అలా చూస్తూ ఉంటే రాజమ్మకు ఎంతో బాధేసేది. ఆ కుటుంబానికి ఎలా సహాయం చేయాలో అర్థం కాలేదు రాజమ్మకు. ఆ కుటుంబాన్ని ప్రధానంగా పీడించే సమస్య తిండి. అప్పుడే కరువుకాలం ప్రారంభమైంది. వరి పంట తక్కువై జొన్నలు అధికంగా పండేవి. ప్రజానీకం అవే తినటం అలవాటు చేసుకుంటున్నారు.
రాజమ్మ ఒక తవ్వెడు జొన్నరవ్వ చేటలో తెచ్చి జానకమ్మ ముందు పెట్టింది. ఇంటి అరుగు మీద దిగాలుగా కూర్చున్న జానకమ్మ ఆ జొన్నరవ్వ చూసి గుడ్లనీళ్లు కుక్కుకున్నది.
“ఇట్లా ఎంతకాలం సాయం చేస్తవ్ రాజమ్మా! నీ రుణం ఎట్ల తీర్చుకోవాలె” అన్నది జానకమ్మ.
జానకమ్మను దగ్గరికి తీసుకొని ఓదార్చాలని అనిపించింది రాజమ్మకు. కానీ, వాళ్లు పెద్ద కులం వాళ్లు. తమదేమో తక్కువ కులం.
“అమ్మగారూ! కట్టాలు కలకాలం ఉండవు. కానీ, నీ కట్టం ఒకరు తీర్సగలిగేది కాదు. ఆ బగమంతుడే తీర్చాలె. ఈ గింజలు గట్క వొండు. అయ్యగారికి, ఈ పిల్లలకు ఇంత తినిపించు. బాధపడతా కూసుంటే ఆకలి తీరదు కదా అమ్మా” అంటూ ఓదార్చి వెళ్లిపోయింది రాజమ్మ.
అప్పటికి రెండు రోజులైంది ఆ ఇంట్లో పొయ్యి రాజేసి. జానకమ్మకు ఆ గింజలే అమృతం లాగా అనిపించింది. జొన్న గటక తినడం పిల్లలకు ఎంతో కష్టమైంది. కొడుకు వెంకటాచార్యులు జొన్న గటక చూసి..
“అమ్మా! ఇది మనం తినే అన్నంలాగా లేదు కదమ్మా” అంటూ మొహం విరిచాడు.
“నాన్నగారికి ఆరోగ్యం తొందరగా నయం కావాలంటే.. ఈ ఆహారమే ఇవ్వాలని డాక్టరు చెప్పాడు బాబూ. మరి నాన్నగారికి త్వరగా నయం కావాలి కదా నాన్నా” అంటూ నచ్చచెప్పింది జానకమ్మ.
కష్టాల ఊబిలో ఉన్న జానకమ్మకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకున్నది రాజమ్మ. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. అదే విషయం తన భర్తతో మాట్లాడింది. అతడి సలహా నచ్చింది ఆమెకు.
మర్నాడు రాజమ్మ తాను చేనుకు వెళ్లేటప్పుడు..
“జానకమ్మ గారూ! నాతోపాటు చేనుకు పోదాం రా. ఊరికెనే ఇంట్ల కూసుంటే గుబులుగ ఉంటది” అంటూ తనవెంట చేనుకు తీసుకెళ్లింది. అక్కడ ఒక గంట తర్వాత జానకమ్మకు విసుగు అనిపించింది. రాజమ్మ ఒక గంప తెచ్చి జానకమ్మకు ఇచ్చింది.
“నాకు కాస్త సాయం చెయ్యండి అమ్మగారూ! ఈ పండు మిరపకాయలు తెంపి బుట్టలో వెయ్యి. ఏదో పని చేస్తా ఉంటే.. మనసు తెరిపిన పడుతది కదా!” అని ప్రోత్సహించింది.
చేనులో కూలోళ్లను చూస్తూ కూర్చుంటే, నిజంగానే విసుగు చెందిన జానకమ్మకు.. కాస్త ఏదైనా పని చేస్తుంటే బావుండు అనిపించింది. రాజమ్మ చెప్పినట్లుగానే పండు మిరపకాయలు ఏరడం మొదలుపెట్టింది. సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చాక, రాజమ్మ చేటలో జొన్నలు పోసి తెచ్చింది.
అట్లా జానకమ్మను, రాజమ్మ రోజూ తనతోపాటు చేనుకు తీసుకొనిపోయేది. సాయంకాలం ఇంటికి వచ్చాక.. జొన్నలో, సజ్జలో చేటలో పోసి తీసుకువచ్చి అరుగు మీద పెట్టేది.
నాలుగు రోజుల్లో జానకమ్మకు అర్థమైంది.. తనుకూడా వాళ్లతో పాటు కూలి పనికి వెళుతున్నానని. కానీ, ఆ పని కూడా చేయకపోతే, ఆ కాసిన్ని తిండి గింజలు కూడా దొరకవనే సత్యం కూడా అవగతమైంది ఆమెకు.
ఆ విధంగా జానకమ్మను తన పరిధిలోకి తీసుకొచ్చుకున్నది రాజమ్మ.
“మీలాంటి పెద్దోల్లకు సాయపడితే మాకు పోయిన జన్మల పాపాలు పోతాయట తల్లీ” అంటూ జానకమ్మను తనవెంట కూలికి తీసుకొని పోయేది రాజమ్మ.
కాలచక్రం తిరిగి పోయింది. వెంకటాచార్యులు చదువు పూర్తయ్యాక.. ప్రభుత్వ ఉద్యోగం దొరికింది. జానకమ్మ పెదనాన్న కొడుకు పరమేశం.. తన బిడ్డ పరిమళను వెంకటాచారికి ఇచ్చి పెళ్లిచేశాడు. పక్షవాతంతో మంచంలోనే ఉన్న వరదాచార్యులుకు మెరుగైన వైద్యం లభించడంతో కాస్త కర్ర పట్టుకుని నడవసాగాడు. కొడుక్కు ఉద్యోగం వచ్చాక జానకమ్మ కూలి పనికి వెళ్లడం మానేసింది. కానీ జానకమ్మ, రాజమ్మ మధ్య స్నేహం మాత్రం తగ్గలేదు. రోజుకు ఒకసారైనా కాసేపు కూర్చొని మాట్లాడుకోకపోతే వారికి మనసు తృప్తిగా ఉండదు.
అంతా సవ్యంగా ఉందని మనం అనుకుంటూ హాయిగా ఉంటే.. కాలం అలా కాదు కదా! తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. రాజమ్మకు అకస్మాత్తుగా సుస్తి చేసింది. రెండు మూత్రపిండాలూ దెబ్బతిన్నాయని, మూత్ర పిండం మార్చకపోతే బతకదని చెప్పారు డాక్టర్లు. హాస్పిటల్లో రాజమ్మను చూడ్డానికి వెళ్లిన జానకమ్మ.. తన కిడ్నీని రాజమ్మకు ఇస్తానని చెప్పింది. డాక్టర్లు పరీక్ష చేసి.. ఆమె కిడ్నీ సరిపోతుందని చెప్పారు. కానీ, జానకమ్మకు ఇంట్లోంచి వ్యతిరేకత ప్రారంభమైంది.
వరదాచార్యులు, అతని వియ్యంకుడు పరమేశం దీనిని వ్యతిరేకించారు.
“తక్కువ కులం వాళ్లతో సహవాసం చేయడమే దోషం. నిత్యాగ్ని హోత్రంలాంటి మన శ్రీ వైష్ణవ కుటుంబాలకు, ఆ తక్కువ కులం వాళ్లతో సావాసం ఏమిటి? ఇంతకాలం అడిగేవాళ్లు లేరనేగా! ఇప్పుడు ఈ ఇంటికి పిల్లనిచ్చిన వ్యక్తిగా నేనందుకు ఒప్పుకోను. అసలు ఆ తక్కువ కులం వాళ్లతో స్నేహమే నాకు ఇష్టం లేదు. మనవి సంశ్రయణాలు చేసిన సంప్రదాయ కుటుంబాలు. నిత్యం పూజలు, పునస్కారాలు చేసే శ్రీ వైష్ణవులం. ఈ కుల భ్రష్టతకు నేను ఒప్పుకోను. మనవాళ్లు కిడ్నీలు కూడా అలాంటి వారికి ఇవ్వకూడదు” అంటూ ఒంటికాలు మీద లేచాడు పరమేశం.
తన బిడ్డను వెంకటాచార్యులకు ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి.. ఆ విధంగా తన ఆధిక్యతను నిలుపుకోవాలని అతని ప్రయత్నం.
నివ్వెరపోయిన జానకమ్మ.. వెంకటాచార్యుల వైపు చూసింది. ఆమె కళ్లలో నీళ్లు లేవు. గత కాలంలో తాము పడిన కష్టం, రాజమ్మతో ఆమె స్నేహం, రాజమ్మ చేసిన సహాయ సహకారాలు అన్నీ కనిపించాయి వెంకటాచార్యులకు. నెమ్మదిగా లేచి వచ్చి, తల్లి భుజం మీద చేయి వేశాడు.
తల్లిని దగ్గరికి పొదువుకున్నాడు. ఆమె నుదుట ముద్దు పెట్టుకున్నాడు.
“మామయ్యా! మీ ఆరాటంలో అర్థం ఉన్నది. కానీ మానవత్వం లేదు. మా నాన్నగారికి జబ్బు చేసి, మంచాన పడి ఉన్న రోజున.. మేము గుక్కెడు గంజి నీళ్లకు నోచుకోని రోజున.. మన కులం ఏం చేసింది? మీరు అప్పుడు ఎక్కడున్నారు? నాకు ఈ రోజున గవర్నమెంట్ జాబు వచ్చిందని మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినంత మాత్రాన.. మా కుటుంబం మీద మీకు అధికారం రాదు కదా! మన కులం వాళ్లకు కొలమానం.. సంశ్రయణాలు కాదు, మానవత్వం. తక్కువ కులంలో పుట్టినా, రాజమ్మ తన సహృదయంతో మా కుటుంబానికి ఆసరాగా నిలిచింది. మమ్మల్ని ఆదుకున్నది. ఈరోజు ఆమె కష్టంలో ఉంటే కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. మా అమ్మకు, రాజమ్మకు మధ్య ఉన్నది స్నేహం కాదు.. గొప్ప అనుబంధం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజమ్మ నాకు రెండో తల్లి. ఈ విషయంలో మా అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటే, దానికి అందరం బద్ధులమై ఉండాలి. ఇష్టం లేనివాళ్లు ఇప్పుడే వెళ్లిపోవచ్చు” అన్నాడు వెంకటాచారి ప్రశాంతంగా.
తూటాల్లాగా వెలువడిన ఆ మాటలలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం కనిపించింది.
పరిమళ లోపలికి వెళ్లి బ్యాగు తెచ్చి తండ్రికి ఇచ్చి.. గుమ్మం దాకా సాగనంపి వచ్చింది.
ఆపరేషన్ సక్సెస్ అయింది.
జానకమ్మ, రాజమ్మ అరుగుమీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే.. కోడలు పరిమళ రెండు గ్లాసులతో టీ తీసుకొచ్చి ఇచ్చింది.
జానకమ్మ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ, రాజమ్మ చేనుకు వెళ్లిన మొదటి రోజు గురించి తలుచుకున్నది. ఆమె కళ్ల వెంట నీళ్లు తిరిగాయి.
జానకమ్మ కళ్లు తుడిచి, అక్కున చేర్చుకోవాలనుకున్నది రాజమ్మ. కానీ, కులం గుర్తుకు వచ్చింది రాజమ్మకు.
“అమ్మగారూ! మీరింకా కండ్ల నీళ్లు పెట్టే గాచారమేమున్నది? కాలమంత మారిపోయింది కదా. చెట్టంత కొడుకు నీకు అండగ ఉన్నడు. ఏడవకుండ్రి. కండ్లు తుడ్సుకోండి!” అన్నది రాజమ్మ.
“నీ సావాసమే నాకు కొండంత అండ రాజమ్మా!” అంటూ చీర కొంగుతో కళ్లు తుడుచుకున్నది జానకమ్మ.
నెల్లుట్ల రుక్మిణి
కష్టాల్లో ఉన్నవారికి ఎలాగైనా సాయం చేయాలనే తపన.. మానవ జీవితానికి విలువను తీసుకొస్తుంది. అలాంటి తపనతో ఉన్న ఓ నిరుపేద స్నేహితురాలికి, ఆమె ఆప్యాయతకు, స్నేహబంధానికి, సామాజిక అంతరాలు అడ్డురావని చెప్పే కథ.. ‘సావాసం’. రచయిత్రి నెల్లుట్ల రుక్మిణి. మనుషులను, జీవితాలను, ప్రకృతిని పరిశీలించడం.. చిన్నప్పటినుంచే అలవాటు చేసుకున్నారు. 50 ఏళ్ల కింద.. పదేళ్ల వయసులో తన పరిశీలన, అనుభవంలో ఉన్న విషయాలే.. ‘సావాసం’ కథకు మూలం. ఇల్లెందు క్రాంతి స్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేసినప్పుడు.. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేసేవారు.
ఆ పిల్లల తల్లిదండ్రులతో కలిగిన పరిచయం.. వీరిలో కథలు రాయాలనే తలంపునకు కారణమైంది. వారు చెప్పిన జీవిత వెతలనే, కథలుగా మలిచేందుకు ప్రయత్నించారు. వీరు రాసిన పలు కథలు.. కొత్తగూడెం రేడియో కేంద్రంలో మూడేళ్లపాటు ప్రసారమయ్యాయి. అనేక కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘వెన్నెల పూలు’ బాలగేయ సంపుటి, ‘బతుకు ఎతలు’ కథల సంపుటిని ముద్రించారు. అనేక బహుమతులు, అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. నిర్మాతగా.. శ్రీ వెంకటేశ్వర మహత్యం, ఈ రాత్రి గడిస్తే చాలు చిత్రాలను నిర్మించారు.
నెల్లుట్ల రుక్మిణి
90004 41271