మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్ 30 : ‘రారండో రారండో దండోలే బయలెల్లండో’ అంటూ పల్లెపల్లెనా నిన్నటి దాకా సాగిన ప్రచారానికి అంచనాలకు మించిన స్పందన వచ్చింది! ‘ఎత్తండెత్తండెత్తండో గులాబీ జెండా ఎత్తండో.. కేసీఆర్ కారు గుర్తుకే ఓటేయ్యండో’యని పాడుకుంటూ పల్లెలు వెల్లువెత్తి చండూరు సభలో పోటెత్తినయ్. మునుగోడు గుండె మీద గులాబీజెండా ఎగరేసినయ్. మాదిగ డప్పు దరువులు, లంబాడాల రేల ఆటలు, జానపద పాటలు, ధూంధాం ఆటలు, కేసీఆర్ మాటలు నింపిన ఉత్సాహం, ఉద్యమకాలపు ఉద్వేగం, ముందే తెలిసిన గెలుపుతో సభ సాంస్కృతిక సంబురంగా సాగింది. రెండు గంటలపాటు సాగిన సాంస్కృతిక సంబురంలో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు మునిగి తేలారు!
చండూరు పట్టణానికి సమీపంలోని బంగారిగడ్డ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోరుతూ నిర్వహించిన ‘మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఎన్నికల బహిరంగ సభ’ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలు జనానికి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. సభా ప్రాంగణంలో ప్రధాన వేదికకు పక్కనే ఏర్పాటు చేసిన ‘ధూం ధాం’ వేదికపై కళాకారుల ప్రదర్శనలు సభికులను అలరించాయి. సభికులను పాటలతో ఆలోచింపజేస్తూనే, ఆటలతో ఆనందపరిచారు. కేసీఆర్ రాకకోసం తరలివచ్చిన వేలాది మందిని మూడు గంటలపాటు ఆటపాటలే ఉత్సాహం నింపాయి. ‘తెలంగాణ తెచ్చినవాడు ఇచ్చినమాట తప్పనివాడు.. భగీరథ నీళ్లించ్చిండు మునుగోడు బాధలు తీర్చిన’ అంటూ పాడే చరణాలను వింటూ మునుగోడు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమ కాలంలో ఉద్వేగంతో నిండిన ఆటపాటలతో సాగిన సభల తర్వాత మళ్లీ ఎన్నాళ్లకో జరిగిన ఈ సభలో సాగిన పాటలు, ప్రదర్శనలు నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మునుగోడు బాధల్ని, ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబించే పాటలకు జనం మమేకమయ్యారు. టీఆర్ఎస్, వామపక్షాల సభలో ఐక్యత వెల్లివిరిసినట్టే కళాకారులూ ఐక్యతని చాటుతూ ‘దోస్తరదిన్ అందమా దోస్తీ కట్టుకుందమా.. అలయ్ బలయ్ తీసుకోని ఆటలాడుకుందమా’ అంటూ వేదికపై దుంకుతూ పాటెత్తుకున్నారు. ప్రధాన వక్తల ప్రసంగాలు ప్రారంభమయ్యే వరకు కళాకారులు ఈ ఆటపాటలు ఆపలేదు. కళాకారుల ఆటపాటలకు జనం కేరింతలకు కొడుతూ నృత్యాలు చేశారు. ‘ఏందయబాబో యమ ఎగురుతుండు రాజగోపాల్? ఏందయ బాబో యమ దునకుతుండు రాజగోపాల్?’ పాటకు జనం నవ్వులే నవ్వులు.
‘స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది.. పరవశించి రాష్ట్ర వీణ పాట పడుతున్నది’ అని కళాకారులు పాడుతుంటే నెత్తిమీద ఎండ మండుతున్నది. అయినా సరే కోతల్లేని కరెంటుతో కోటి కాంతుల తెలంగాణలా మునుగోడు ఎన్నికల సభా ప్రాంగణం వెలిగిపోయింది! ఎట్లాంటి తెలంగాణ ఎట్ల మారిందో చెబుతూ స్వరాష్ట్రంలో ఒక్కో రంగం ఏ తీరుగ అభివృద్ధి చెందిందో ఈ పాట చరణాలు వివరిస్తుంటే ఆసక్తిగా తిలకించారు. గ్రామాల నుంచి కొందరు కాలికి గజ్జకట్టి, డప్పు చంకనబెట్టి ఆడుకుంటూ సభకు తరలివచ్చారు. సభలోనే లంబాడాలు పాటలు పాడుతూ, డప్పు దరువులకు చిందేశారు. ఆ ఉత్సాహాన్ని పెంచుతూ ధూంధాం వేదికపై సాయిచంద్ నేతృత్వంలోని ధూంధాం కళాకారులు, పల్లె నర్సింహ నేతృత్వంలోని తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు, ప్రజా నాట్యమండలి కళాకారులు ఆటపాటలతో సభికులను అలరించారు. ‘కారు పార్టీదే గెలుపు కండ్ల ముందె తెలుస్తుంది’ అని కళాకారులు పాడినట్టే జరిగిన సభను విజయవంతం చేయడంలో కళాకారులదే గెలుపు! ఎన్నికలకు ముందే గెలుపెవరిదో తెలిపేలా సాగిన సభకు కేసీఆర్ ప్రసంగం ప్రధాన ఆకర్షగా నిలిస్తే, దాని తర్వాత మిగతా నేతల ప్రసంగాల కంటే సాంస్కృతిక ప్రదర్శనలే ఎక్కువగా స్థానికుల్ని ఆకట్టుకున్నాయి.
గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నది. ఆర్థికంగా ఎదుగడానికి దళిత బంధు పథకంతో ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటికే కొన్ని మండలాల్లో దళిత బంధు పథకంతో దళితులు లబ్ధి పొందారు. పథకాన్ని మిగతా గ్రామాలకు దశల వారీగా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పిండు. ఇంత పెద్ద మొత్తంలో సాయం చేయడానికి ఏ నాయకుడూ ముందుకు రాలే. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ. ఏ ఎలక్షనైనా టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తం.
– గ్యార నగేశ్, మర్రిగూడ
ముస్లింలను తక్కువ చేసి చూసే బీజేపీకి ఓటెయ్యం. అందరం ఒకే ఊర్లో ఉంటున్నాం. హిందువు, ముస్లిం అనే తేడా మాకుండదు. బీజేపీ మాత్రం వేర్వేరుగా చూస్తూ మాకు మనస్పర్థలు వచ్చేలా చేస్తున్నది. అన్ని మతాలను సమానంగా చూసే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తం. ముస్లింలు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ పార్టీ అవకాశాలు ఇస్తున్నది. హిందువులకు కల్యాణలక్ష్మి, ముస్లింలకు షాదీ ముబారక్ పథకం ఇచ్చి మమ్ములను ఆదుకుంది. పెండ్లికి లక్ష రూపాయలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అది ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కే సాధ్యమైంది. మేమందరం టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీ గెలిపిస్తాం.
– సయ్యద్ హైమద్, రాజపేట తండా, మర్రిగూడ(మం)