రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అందించే దిశగా అటు ప్రభుత్వం.. ఇటు ఉన్నత విద్యామండలి కలిసి ముందుకు సాగుతున్నాయి. గతంలో అస్తవ్యస్తంగా మారిన బీఈడీ విద్యను రాష్ట్ర ప్రభుత్వం గాడిలోకి తేచ్చే విధంగా వర్సిటీ అధికారులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేయించింది. ప్రమాణాలు సరిగా లేని 14కళాశాలలకు అనుమతులు ఇవ్వలేదు. దాంతో అవి మూతపడ్డాయి. ఈ పర్యాయం మళ్లీ తనిఖీలు చేస్తుండడంతో నిబంధనల మేరకు వసతులు లేనివాటికి అప్లియేషన్స్
(గుర్తింపు) ఇవ్వవద్దనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. అందులో భాగంగానే ఎంజీయూ
పరిధిలో ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుపనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ,బీపీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ కళాశాలల తనిఖీలు, అప్లియేషన్స్కు సంబంధించిన
కళాశాలల వివరాలతో కూడిన నివేదికలను,అప్లియేషన్ ఫీజును ఇప్పటికే ఆయా కళాశాలల యాజమాన్యాలు అందజేశాయి.
ఎంజీయూ పరిధిలో 37 కళాశాలలు..
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 బీఈడీ, ఆరు ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ, డీపీఈడీ), 3 మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో నల్లగొండ జిల్లాలో 19, సూర్యాపేటలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 కాలేజీలు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు చొప్పున, యాదాద్రి భువనగిరిలో ఒకటి ఉన్నాయి. బీఈడీ కళాశాలల్లో 1 ప్రభుత్వ కాలేజీ ఉండగా.. మిగిలినవి ప్రైవేట్ కళాశాలలు. ఆయా కళాశాలల్లో 2015-16 నుంచి రెండేండ్ల బీఈడీ కోర్సు కొనసాగుతుండగా ఛాత్రోపాధ్యాయులు (విద్యార్థులు) శిక్షణ పొందుతున్నారు. అయితే 2016-17లో 8 కళాశాలల్లో తక్కువ అడ్మిషన్లు కావడంతో కోర్సును నిర్వహించలేమని తమ కళాశాలలకు అలాట్ చేయబడిన అడ్మిషన్లను తిరిగి రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించడంతో ఈ కళాశాలలు 2016-17కు నిద్రావస్థ (స్లీపింగ్)లో ఉండిపోయాయి. ఈ పర్యాయం నకిరేకల్‌లోని ఏవీఎం కాలేజ్ ఎఫ్ ఎడ్యుకేషన్‌ను మూసివేశారు. అయితే.. గతంలో మాదిరిగా ఈ పర్యాయం కూడా నిబంధనలు పాటించకుండా ఉన్న కళాశాలలను మూతవేస్తారా.. లేదా? వేచిచూడాల్సి ఉంది.
నిబంధనల మేరకే అనుమతులు
ప్రభుత్వం, ఎన్సీటీఈ, వర్సిటీ నిబంధనల మేరకు కొనసాగే కళాశాలలకు అప్లియేషన్స్ (గుర్తింపు) ఇస్తాం. అందుకే ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ సూచనతో ఆయా విభాగాల్లో నిపుణుల బృందంతో ఈ నెల 10, 11తేదీల్లో తనిఖీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. తనిఖీల నివేదికలను బృందం సభ్యులు నేరుగా కళాశాల విషయాలను తెలుపుతూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు అందజేస్తారు. నాణ్యతా ప్రమాణాలు, వసతులు ఉంటేనే ‘టీఎస్ ఎడ్‌సెట్-2022’, సీపీగేట్-2022 కౌన్సెలింగ్‌కు అనుమతి వస్తుంది. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. కచ్చితంగా వ్యహరించాం కాబట్టే.. గతంలో తెలంగాణలో అన్ని వర్సిటీల కంటే ఎంజీయూ పరిధిలో అత్యధికంగా బీఈడీ కళాశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం.
– డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ సెల్, ఎంజీయూ
ప్రమాణాలపై కచ్చితంగా వ్యవహరించిన ఎంజీయూ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2015-16లో బీఈడీ కళాశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో తెలంగాణలోని అన్ని వర్సిటీల కంటే ఎంజీయూ అధికారులు కచ్చితంగా వ్యవహరించి తనిఖీలు చేయడంతో 48 కళాశాలలకుగాను 34 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. దీనిపై ఆయా కళాశాలల వారు రాజకీయ ఒత్తిడి తేవడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. అయిప్పటికీ యూనివర్సిటీ అధికారులు నిబంధనల మేరకు కచ్చితంగా వ్యవహరించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14కళాశాలలు మూతపడ్డాయి. ఈ విషయంలో వర్సిటీ అధికారులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలితోపాటు హైకోర్టు సైతం ప్రశంసలు అందజేసిన విషయం విదితమే. అయితే.. 2016-17లో 26 కళాశాలలు మాత్రమే తరగతులను నిర్వహించగా.. మిగిలినవి స్లీపింగ్‌లో ఉన్నాయి. 2017-18లో 8కళాశాలలు స్లీపింగ్‌లో ఉండిపోయాయి. 2021లో రెండు కళాశాలలను మూసివేశారు. 2022-23 (ప్రస్తుత) విద్యా సంవత్సరానికి ఈ నెల 10, 11తేదీల్లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తనిఖీల అనంతరం ఎన్ని కళాశాలలు మూతపడుతాయో..? ఎన్నింటికి అనుమతులు వస్తాయో
తేలనుంది.
తనిఖీల్లో పరిశీలించే అంశాలు..
కళాశాల భవన డాక్యుమెంట్స్
కళాశాల సొసైటీ వివరాలు.. అందుకు సంబంధించిన పత్రాలు
కాలేజీకి ఎన్సీటీఈ ఇచ్చిన గుర్తింపు పత్రాలు
ల్యాబ్స్, లైబ్రరీ, మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్
గవర్నింగ్ బాడీ – సమావేశాల రిజిష్టర్
ప్రిన్సిపాల్, అధ్యాపకుల వివరాలు
విద్యార్థులు, అధ్యాపకుల హాజరు రిజిష్టర్లు
టీచింగ్ డైరీ, విద్యార్థుల రికార్డులు
అధ్యాకులకు చెల్లించే జీతాలు బ్యాంకు ద్వారా ఇస్తున్నారా.. లేదా?
విద్యార్థుల హాజరు వివరాలు, టీచింగ్ ప్రాక్టీసు అంశాల పరిశీలన చేస్తారు