నేరేడుచర్ల, జూన్ 7 : నియోజకవర్గంలో నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన నేరేడుచర్లతోపాటు హుజూర్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కంకణం కట్టుకున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లను సీఎం కేసీఆర్ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరిన్ని నిధుల సాధనలో భాగంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను మంగళవారం కలిసి నిధులివ్వాలని కోరారు. అడిగిన వెంటనే ఒక్కో మున్సిపాలిటీకి రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఈ నిధులతో రెండు మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే సైదిరెడ్డితోపాటు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు త్వరలో మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి రానున్నట్లు సమాచారం.