నీలగిరి, మార్చి 29 : అక్రమంగా గుట్కా, రవాణా చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేసి సుమారు రూ.8.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్రమ రవాణా, ముఠా వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి గుట్కా రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన అబూబకర్ హైదరాబాద్‌కు చెందిన కాట్రవత్ రాజు అలియాస్ శివ ముఠాగా ఏర్పడి ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద పోలీసుల తనిఖీలో పట్టుకున్నట్లు చెప్పారు. పోలీసులను చూసి ఇద్దరు పరారీ కాగా అబాబకర్ పోలీసులకు చిక్కడంతో అతడి నుంచి 17 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ గోవర్ధన్ డార్లి అలియాస్ సోనూ మల్కన్‌గిరి జిల్లాలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోని కట్టంగూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. డార్లి వద్ద 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నల్లగొండ పట్టణంలో బాపనసల్లి ఆంజనేయులు నిషేధిత గుట్కాలను తీసుకుని నల్లగొండ వస్తుండగా పట్టుబడ్డాడు. ఆయనను విచారణ చేయగా వీటీ కాలనీకి చెందిన వీర్లపాటి యాదగిరి దగ్గర కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. దాంతో ఆయనను విచారణ చేయగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి గుట్కాలు తీసుకొస్తున్నట్లు చెప్పడంతో వారిని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈకేసులో చాక చక్యంగా పనిచేసిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ రాఘవరావు, నల్లగొండ టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, కేతేపల్లి, కట్టంగూర్ ఎస్ఐలు అనిల్‌రెడ్డి, విజయ్,టాస్క్‌ఫోర్స్ సీఐ బాలగోపాల్‌లను ఎస్పీ అభినందించారు.