రాష్ట్రంలో రెండు పంటల వడ్లను పంజాబ్ తరహాలో పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళనకు సన్నద్ధమవుతున్నది.పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణపై దృష్టి సారించింది. గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోసన్నాహక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామం నుంచి అన్ని స్థాయిల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరిని బట్టి ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ మేరకు సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లతో పాటు పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, మార్కెట్ కమిటీల పాలకవర్గాలు సైతం తీర్మానాలు చేసేలా అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 24న జరుగనున్న సన్నాహక సమావేశాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 22(నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కుట్రలకు మరో మారు తెరలేపింది. రైతులు పండించిన ధాన్యంలో ముడి, బాయిల్డ్ బియ్యం అంటూ విడదీస్తూ అయోమయానికి గురి చేస్తున్నది. ఏండ్ల తరబడి బాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి కేవలం ముడి(రారైస్) బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కొర్రీలు పెడుతూ రైతుల్లో ఆందోళనకు గురిచేస్తున్నది. వాస్తవంగా ఉమ్మడి జిల్లా పరిధిలో స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి యాసంగిలో 90 శాతం దొడ్డు రకం ధాన్యాన్ని సాగు చేయడమే రైతులకు ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. సన్నాలకు యాసంగిలో చీడ పీడల బాధతో పాటు ఎండవేడిమికి సన్నాలు విరిగి బియ్యం సరిగ్గా కావన్న కారణంతో రైతులు దొడ్డు బియ్యం వైపు మొగ్గు చూపుతుంటారు. ఇదే పద్ధ్దతిలో ఈ యాసంగిలోనూ మెజార్టీ రైతులు దొడ్డురకం సాగు చేశారు.
స్వరాష్ట్రంలో అందివచ్చిన సాగునీటి వనరులు, ఉచిత కరంటు అందుబాటులో ఉండడంతో రైతులు సాగునుంచి తప్పుకోలేకపోయారు. యాసంగిలో వరి సాగు వద్దని చెప్పినా చాలా చోట్ల అది తప్ప వేరే పంట పండే పరిస్థితి లేకపోవడంతో రైతులు వరిసాగుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో మరికొద్దీ రోజుల్లో వరికోతలు ప్రారంభం కానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతులపై కక్ష గట్టి వ్యవహరిస్తుండడాన్ని జిల్లా రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. క్షేత్రస్థాయి నుంచి రైతుల పక్షాన పొట్లాడేందుకు టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నది.
నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తయ్యాక కార్యాచరణపై మరింత స్పష్టత రానున్నది. అదేవిధంగా తీర్మానాల్లో పొందుపర్చాల్సిన అంశాలపైన అవగాహన కల్పించనున్నారు. ఇక ముందు పార్టీ అధినేత ఏ పిలుపునిచ్చినా పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా సిద్ధ్దంగా ఉండాలని కూడా ఈ సమావేశాల ద్వారా స్పష్టం చేయనున్నారు. కేంద్రంపై చేసే పోరాటాల్లో రైతులతో పాటు ప్రజలను, ముఖ్యంగా యువతను కూడా భాగస్వాములు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సన్నాహాక సమావేశాలను విజయవంతం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం ప్రభుత్వంపై సుదీర్ఘ పోరాటానికి సిద్ధ్దం కాక తప్పదంటూ.. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. పార్టీ శ్రేణులు, నేతలు, అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులంతా ఈ సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఏ క్షణంలో ఏ పిలుపునిచ్చినా ఉమ్మడి నల్లగొండ జిల్లా మరోసారి తన ఉద్యమ స్ఫూర్తిని చాటేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
అన్ని స్థాయిల్లో తీర్మానాలు
యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించే విధానాన్ని బట్టి దశలవారీగా ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కలువనుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి ఉద్యమాన్ని రూపొందించాలన్నది పార్టీ నిర్ణయం. ఈ మేరకు తొలి దశలో గ్రామ, మండల, జిల్లా పరిషత్తు, సహకార సంఘాల్లో, మార్కెట్ కమిటీల్లో తీర్మానాలు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 26న గ్రామ పంచాయతీ, 27న మండల పరిషత్తు, 30న జిల్లా పరిషత్తు పాలకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లపై తీర్మానాలు చేయనున్నారు. దీంతో పీఏసీఎస్ పాలకవర్గాల్లో, మార్కెట్ కమిటీల్లోనూ ఇదే తరహ తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఆ తర్వాత కూడా కేంద్రం దిగి రాకపోతే ఏప్రిల్ 2 నుంచి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలన్నది పార్టీ భావన.
రేపు సన్నాహాక సమావేశాలు
ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం సన్నాహాక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సారధ్యంలో జరిగే ఈ సమావేశాలకు గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి నేతలు, ప్రజాప్రతినిధుల వరకు హాజరయ్యేలా పిలుపునిచ్చారు. ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లు, కేంద్రం తీరు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో పార్టీ వైఖరిని వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు విడమరిచి చెప్పనున్నారు. వీటితో పాటు ధాన్యంపై దశలవారీ పోరాటాలకు సమయాత్తం చేసేలా నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతీ పోరాటంలోనూ రైతులను కలుపుకువచ్చేలా కార్యచరణ ఉండాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రంపై జరిగే పోరాటంలో అందరూ క్రియాశీలకంగా పాల్గొనేలా పలు సూచనలు చేయనున్నారు. అనంతరం స్థానిక సంస్థల్లో చేయాల్సిన తీర్మానాలపైనా అవగాహన కల్పించనున్నారు.