నల్లగొండ ప్రతినిధి, మార్చి15(నమస్తే తెలంగాణ): దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఉద్యమ సమయంలోనే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే స్వరాష్ట్రంలో దశలవారీగా ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు అందుతున్నాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి సైతం ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. రాష్ర్టాభివృద్ధ్దిలో ఉద్యోగులు, సిబ్బ ంది పాత్ర కూడా కీలకమని పదేపదే ప్రస్తావించే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగానే వారి సంక్షేమం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు.
పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ ప్రాంతాల్లో కృషి చేస్తున్న సెర్ఫ్ ఉద్యోగులు, సిబ్బందికి, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మెప్మా సిబ్బందికి వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించారు. వీరికి వేతనాలు త్వరలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అందనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో సెర్ఫ్, మెప్మాలో పనిచేస్తున్న వారందరూ ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెర్ఫ్‌లో 390, మెప్మాలో 39 మంది కాంట్రాక్ట్ పద్ధ్దతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి వీరంతా దశలవారీగా విధుల్లోకి వచ్చారు. ప్రారంభంలో వెలుగు పథకం, తర్వాత సెర్ఫ్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇందులో వివిధ స్థాయిల్లో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాస్టర్బుక్ కీపర్(ఎంబీకే) నుంచి కమ్యూనిటీ కోఆర్డినేటర్(సీసీ), అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్(ఏపీఎం), డీపీఎం, ప్రాజెక్టు మేనేజర్ ఇలా జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఉద్యోగులు ఉన్నారు.
వీరికి ప్రస్తుతం స్థాయిని బట్టి నెలకు రూ. 20 వేల నుంచి 42 వేల వరకు వేతనాలుగా చెల్లిస్తున్నారు. అయితే వీరు చాలా కాలంగా తమ వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక వీరితో పాటు పట్టణాల్లో పనిచేస్తున్న మెప్మా సిబ్బందిలో సైతం కంప్యూటర్ కోఆర్డినేటర్ నుంచి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వరకు పలు స్థాయిల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరికి స్థాయిని బట్టి ప్రస్తుతం నెలకు రూ.20వేల నుంచి 32వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే వీరందరికీ ఇక ముందు స్థాయిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో దీనిపై విధివిధానాలు రూపొందించాక త్వరలోనే స్పష్టత రానుంది.
ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి…
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ పథకం అమలులో పారదర్శకత లోపించడం తో పాటు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2020 మార్చి 18 నుంచి వీరందర్నీ విధుల నుంచి తప్పి స్తూ ఆ బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ సుమారుగా 1,120 మంది ఫీల్డ్ అసిసెంట్లుగా పనిచేస్తున్నారు. వీరిని కూడా విధుల నుంచి తప్పించడంతో అప్పటి నుంచి వీరంతా ఆందోళనలో ఉన్నారు. పలు సందర్భాల్లో తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గతంలోని తప్పులను పునరావృతం కానివ్వమంటూ ఉపాధి హామీ పథకం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని విన్నవించుకున్నారు. వీరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిసెంట్లను విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే మళ్లీ పొరపాట్లు పునరావృతం కానివ్వొద్దు అంటూ ఇదే సందర్భంగా సీఎం సుతిమెత్తగా హెచ్చరించారు. 2006లో నెలకు రూ.1,200 గౌరవవేతనంతో విధుల్లోకి తీసుకున్న వీరిని బాధ్యతల నుంచి తప్పించే నాటికి నెలకు రూ.8,400 వేతనంతో పాటు టీఏ, డీఏలతో కలిపి సుమారు రూ.10వేల వరకు పొందుతున్నారు. అయితే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉమ్మడి జిల్లా అంతటా ఫీల్డ్ అసిసెంట్లు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.
పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. బుధ, గురు వారాల్లో కూడా అన్నిచోట్ల ఉత్సవాలు నిర్వహించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించారు. ఇక మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న మహిళలకు ఇచ్చే గౌరవవేతనం కూడా నెలకు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేల వరకు పెరిగింది. ఉమ్మడి జిల్లాలో వీరు 3 వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరి గౌరవవేతనం పెంపు పట్ల కూడా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద హర్షం వ్యక్తం చేస్తూ సభ నిర్వహణకు మధ్యాహ్న భోజన కార్మికులు సిద్ధమవుతున్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మాకెంతో ధైర్యానిచ్చింది
శాలిగౌరారం/ తిరుమలగిరి, మార్చి 15 : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మంగళవారం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం నల్లగొండ జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎర్ర బుచ్చయ్య, తిరుమలగిరి మండలాధ్యక్షుడు యాకూబ్‌నాయక్ మాట్లాడుతూ మా కష్టాలను అర్థ్ధం చేసుకొని విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం మాకెంతో ధైర్యాన్నిచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రకటన విడుదల చేసిన వారిలో కృష్ణ, ఉపేందర్, నీరజ, సైదులు, వనజ ఉన్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
మెప్మాలో సిబ్బంది పడుతున్న బాధలను గుర్తించి, వారి కుటుంబాలు పడుతున్న వెతలు చూసి చలించి జీతాలు పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో యేండ్లుగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్న మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచి జీవితాల్లో వెలుగులు నింపారు. వారితోపాటు సమాన వేతనాలు ఇవ్వడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. -నిమ్మల అనిల్ కుమార్, కమ్యూనిటీ ఆర్గనైజర్, నల్లగొండ మున్సిపాలిటీ
ఆనందంగా ఉంది
రెండేండ్లుగా ఎదురు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మళ్లీ వస్తున్నాయంటే ఆనందంగా ఉంది. 2006 నుంచి పని చేస్తున్న మేము 2020 మార్చిలో సమ్మెకు వెళ్లడంతో ప్రభుత్వం పక్కన పెట్టింది. కొందరి ఒత్తిడి వల్ల సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. దాని కారణంగా రెండేండ్లు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. మళ్లీ ప్రభుత్వం తీసుకుంటుందనే ప్రకటనతో సంతోషంగా ఉంది.
-రామకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, నల్లగొండ మండలాధ్యక్షుడు
ఇచ్చిన హామీని అమలు చేసినందుకు సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు ఇస్తామని ప్రకటించడం నిజంగా సంతోషం. ప్రస్తుతం తక్కువ వేతనాలతో పని చేస్తున్నాం. ఇక మంచి జీతాలు వస్తాయి. సీఎం ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో సుమారు 400 మంది సెర్ఫ్ ఉద్యోగులకు న్యాయం జరగుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణ పడి ఉంటాం.
-నరహరి, ఏపీఎంల సంక్షేమ సంఘం ,జిల్లా అధ్యక్షుడు నల్లగొండ
విధుల్లోకి తీసుకోవడం ఆనందంగా ఉంది
మమ్ములను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకోవడం పట్టరాని సంతోషం కలిగింది. మాలో కొంతమంది ప్రైవే టు కంపెనీల్లో, దినసరి కూలీలుగా, కొంతమంది ఏపని దొరకక ఇంటి వద్దనే ఉటున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో మాకు చాలా ఆనందంగా ఉంది.
-మల్లేశ్
-ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, చివ్వెంల మండలాధ్యక్షుడు