సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ శాఖల్లో భారీగా కొలువులు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో గ్రంథాలయాలకు రద్దీ పెరిగింది. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో రీడర్ల సంఖ్య 150 మంది కాగా, వారం రోజులుగా 250కి పెరిగింది. చిరుద్యోగం మొదలుకుని సివిల్స్ ప్రిపరేషన్‌కు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడమే అందుకు కారణం. సబ్జెక్టు, జనరల్ నాలెడ్జ్, కాంపిటీటివ్ పరీక్షల కోసం వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఆన్ డిమాండ్ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఎన్ని పుస్తకాలైనా తెప్పిస్తామని, అవసరమనుకుంటే ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
స్వాతంత్య్రానికి పూర్వం గ్రంథాలయోద్యమానికి నాంది పలికిన సూర్యాపేట పట్టణంలోని లైబ్రరీ ఎంతో చారిత్రాత్మకమైనది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదరణ తగ్గిపోగా, రాష్ట్ర ఏర్పాటు అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. మంత్రి సూచనల మేరకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ నిధుల నుంచి రూ.10 లక్షలతో పాటు దాతల సహకారంతో సౌకర్యాలు సమకూర్చారు. అదనపు గది నిర్మాణం, వాటర్ ప్లాంట్, ల్రైబరీ ఆవరణలో చెట్ల కింద బెంచీలు ఇతర ఫర్నీచర్‌తో పాటు వేలాది పుస్తకాలను కొనుగోలు చేశారు.
27వేల పుస్తకాలు… 4వేల సభ్యత్వాలు…
జిల్లా గ్రంథాలయంలో జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, కరంట్ అఫైర్స్‌తో పాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి 27వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా రీడర్ల డిమాండ్ మేరకు పుస్తకాలు కొనుగోలు చేస్తున్నామని లైబ్రేరియన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రూప్స్, టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అధికంగా వస్తున్నారని వివరించారు. 4వేల సభ్యత్వాలు ఉండగా.. వారు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లేందుకు డిపాజిట్ పెట్టుకుని అనుమతిస్తున్నాం.
సౌకర్యాల కల్పనలో రాజీ పడేది లేదు..
గ్రంథాలయంలో చదువుకునేందుకు వచ్చే వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రద్దీకి అనుగుణంగా అన్ని వసతులు సమకూర్చడంలో వెనుకాడే ప్రసక్తే లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో పుస్తకాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తున్నాం. గతంలో 100 మంది వరకు వచ్చేవారు. వారం రోజులుగా 250మందికి పైగా హాజరవుతున్నారు. భోజనశాలతో పాటు లైబ్రరీ భవనం పైన కూడా రీడింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. రీడర్ల కోరిక మేరకు రాత్రి 10 గంటల వరకు లైబ్రరీ తెరిచి ఉంచుతున్నాం. రీడర్లు కోరితే సబ్జెక్టు నిపుణులతో వారంలో ఒకటీరెండు తరగతులు ఏర్పాటు చేయించాలనే ఆలోచనలో ఉన్నాం.
– నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా , గ్రంథాలయ సంస్థ చైర్మన్
పెరుగుతున్న రీడర్ల సంఖ్య
సాధారణ సమయంలో ల్రైబరీకి 100 మంది వరకు వచ్చేవారు. ఈ మధ్య 250కి పైనే వస్తున్నారని గ్రంథాలయ సిబ్బంది చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం నిరుద్యోగుల తాకిడి మరింతగా పెరిగింది. ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు సమయం ఉండగా నిరుద్యోగుల కోరిక మేరకు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. రీడర్లు పెరుగుతుండడంతో భవనం పైన చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు అమర్చగా రెండు మూడు రోజుల్లో కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేస్తామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
సదవకాశంగా భావిస్తున్నాం..
విలువైన సమయాన్ని ఇంట్లో వృథా చేయకుండా రోజూ లైబ్రరీకి వచ్చి గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్నా. లైబ్రరీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకుంటున్నాం. అన్ని రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. కావాల్సిన పుస్తకం లేకుంటే వెంటనే తెప్పిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో చదువుకుంటూ నాలాంటి నిరుద్యోగులెందరో ఉద్యోగాలకు సిద్ధం
అవుతున్నారు.
– తుమ్మల ఉష, కలకోవ
మూడేండ్లుగా ప్రిపేర్ అవుతున్నా..
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకంతో మూడేండ్లుగా ప్రిపేర్ అవుతున్నాను. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నోటిఫికేషన్‌పై ప్రకటన చేయడంతో ధైర్యం వచ్చింది. మరింత సీరియస్‌గా ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో రోజూ లైబ్రరీకి వస్తున్నా. లైబ్రరీలో రీడింగ్ టేబుల్స్‌తో పాటు మినరల్ వాటర్ అందుబాటులో ఉంచడం సౌకర్యంగా ఉంది.
– బోయిని జ్యోతి, లింగంపల్లి