యాదాద్రి, మార్చి15 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆలయంలో ఆర్జిత పూజలు కోలాహలంగా సాగాయి. పూజా కైంకర్యాలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారి నిత్య పూజలు తెల్లవారుజామున ప్రారంభం కాగా బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చనలు జరిపించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు
గంటన్నరకుపైగా కల్యాణ తంతు జరిపారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించిన భక్తులు అష్టోత్తర పూజలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామికి పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి విష్ణు పుష్కరిణి వద్ద క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఆకుపూజ చేశారు. హనుమంతుడిని సింధూరం, చందనంతో అలంకరించి అభిషేకించారు. లలితా పారాయణం చేశారు. ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రసాద విక్రయాలు, సత్యనారాయణ స్వామివారి వ్రత పూజలతోపాటు వివిధ పూజలు, కైంకర్యాలు, గదుల నుంచి రూ. 10,48,729 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.