నల్లగొండ ప్రతినిధి, మార్చి14(నమస్తే తెలంగాణ) : చట్టసభల్లోని అత్యున్నత పదవుల్లో ఒకటైన శాసన మండలి చైర్మన్ పీఠంపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసీనులయ్యారు. ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ నుంచి సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీల సమక్షంలో మండలి చైర్మన్ హోదాలో రెండోసారి సభకు అధ్యక్షత వహించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో దేశంలోనే తెలంగాణ శాసనమండలిని ప్రత్యేకంగా నిలబెట్టాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులైన గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మండలి వేదికగా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు సుఖేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సోమవారం ఆయన శాసనమండలిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అన్ని పార్టీల సభ్యులు రాజకీయాలకతీతంగా సుఖేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆదివారమే ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం లాంఛనంగా చైర్మన్ ఎన్నికను ప్రకటించారు. అనంతరం శాసనమండలి చైర్మన్ పీఠంపై సుఖేందర్‌రెడ్డి ఆసీనులయ్యారు. బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి మండలి సభ్యులతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు స్వయంగా హాజరయ్యారు. ఆ వెంటనే సభాధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను కొనసాగించారు.
ఈ సందర్భంగా మంత్రులతోపాటు పలువురు సభ్యులు గుత్తాను ప్రత్యేకంగా అభినందించారు. శాసన మండలి చైర్మన్‌గా గతంలో చాలా సమర్థవంతంగా సుఖేందర్‌రెడ్డి సభను నిర్వహించడంతోనే మరోసారి పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సభను ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్వహించడంలో గుత్తా సక్సెస్ అయ్యారని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా సభ్యులంతా కలిసి చైర్మన్ పీఠంపై కూర్చొబెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు చెందిన సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డికి చైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వార్డు సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని స్థాయిల్లోనూ పదవులను నిర్వహించిన అనుభవం సుఖేందర్‌రెడ్డికి ఉందన్నారు.
శాసన మండలిని మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు. అత్యధిక కాలం చైర్మన్ పదవిలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర మంత్రులు, సభ్యులు కూడా గుత్తాను అభినందిస్తూ శాసనమండలిలో మాట్లాడారు. రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికైన సుఖేందర్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. మండలిలోనే మంత్రులు, ఇతర సభ్యులంతా పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలి ఆవరణలోనూ పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని గుత్తా స్వగృహంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు యామ దయాకర్, ఆలంకుంట్ల మోహన్ కలిసి గజమాలతో సన్మానించారు.
అందరికీ ధన్యవాదాలు
నాకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చట్టసభల నిర్వహణలో రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలుస్తుంది. అందరి సహకారంతో తొలిసారి 21నెలలపాటు చైర్మన్ బాధ్యతలు నిర్వహించాను. మరోసారి మీ అందరి సంపూర్ణ సహకారం అవసరం. సభా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అత్యున్నతమైన ఈ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించేందుకు కృషి చేస్తా.
-మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి
శుభాకాంక్షల వెల్లువ
దేవరకొండ/పెద్దఅడిశర్లపల్లి : మండలి చైర్మన్‌గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, పెద్దఅడిశర్లపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్‌నాయక్, కౌన్సిలర్ జయప్రకాశ్‌నారాయణ, నాయకులు ప్రదీప్, ఇలియాస్, సైదులు, అశోక్ ఉన్నారు.
మిర్యాలగూడ రూరల్/గుర్రంపోడు : మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట తడకమళ్ల పీఏసీఎస్ చైర్మన్ పాదూరు సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జగదీశ్, మాజీ సర్పంచ్ ఏడుకొండల్, చలికంటి యాదగిరి ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు సుఖేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
వారి వెంట టీఆర్ఎస్ గుర్రంపోడు మండలాధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్‌రావు, సర్పంచులు మస్రత్ సయ్యద్‌మియా, షాహిన్మదార్షా, చాడ చక్రవర్తి, కేసాని యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, ఎంపీటీసీ చంద్రమౌళి, పృథ్వీరాజ్ గౌడ్, లాలయ్య ఉన్నారు.