యాదాద్రి, మార్చి 14 : యాదాద్రిలో స్వయంభు లక్ష్మీనర్సింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 4న ప్రారంభమైన బ్రహోత్సవాలకు సోమవారం రాత్రి డోలోత్సవంతో అర్చకులు ముగింపు పలికారు. అష్టోత్తర శత ఘటాలకు ముక్కోటి దేవతలను ఆవాహన చేసి సమర్పించారు. 108సంఖ్యతో భగవానుడి యొక్క తత్వం నిక్షిప్తమై ఉన్నందున అష్టోత్తర శతఘటాభిషేకానికి ఎంతో విశిష్టత ఉందని అర్చకులు తెలిపారు. శ్రీవారు అమ్మవార్లను పంచామృతాలు, ఫల రసాలు, పరిమళ సుగంధ ద్రవ్యాలు, ఫల జలాలు, సుగంధ భరిత చూర్ణ జలాలు, మంత్ర పూర్వక జపాలతో అభిషేకించారు. సాయంత్రం నిత్యారాధనలు అనంతరం రాత్రి 9గంటలకు స్వామివారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచార్యులు, పారాయణికులను ఘనంగా సన్మానించి ఉత్సవ పరిసమాప్తికి సూచకంగా మంగళ నీరాజనాలు పలికారు.
రాత్రి శృంగార డోలోత్సవం
రాత్రి 9గంటలకు శృంగార డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. నిత్యారాధనల అనంతరం లక్ష్మీనృసింహ స్వామిని వివిధ రకాల పూలతో అలంకరించిన ఊయలలో ఉంచి లాలిపాటలు, భక్తిగీతాలతో సంకీర్తన గావించారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఉత్సవంలో అర్చకులు, భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు, రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, మరింగంటి శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర్‌శర్మ, శ్రవణ్‌కుమార్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.
శాంతి, సుఖ సౌఖ్యాలు కలిగేందుకే శృంగార డోలోత్సవం
డోలము అనగా ఊయల అని అర్థం. ‘మంచస్తం మధుసూదనమ్’ అని ఊయలలో పవళించిన స్వామిని దర్శించిన సర్వవిధ దోశాలు తొలగి భక్తుల మనోరథములు నెరవేరగలవని ఈ శృంగార డోలోత్సవ వేడుక నిర్వహిస్తారని ఆలయ ప్రధానార్చకులు వివరించారు. వేడుకతో లోకాలను శాంతి, సుఖ సౌఖ్యాలు కలుగునని ఆగమశాస్త్రం పేర్కొన్నదని తెలిపారు.
బాలాలయంలో ఆరు సార్లు బ్రహ్మోత్సవాలు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తాత్కాలికంగా నిర్మించిన బాలాలయంలో ఇవి చివరి బ్రహ్మోత్సవాలు. 2016 ఏప్రిల్ 21న ప్రారంభమైన బాలాలయంలో ఇప్పటి వరకు ఆరు సార్లు నిర్వహించారు. 2017 నుంచే బాలాలయంతో పాటు భక్తుల సందర్శనార్థం కొండకింద పాత పాఠశాల మైదానంలో వైభవ ఉత్సవాలు ప్రారంభించారు. స్వామివారి ప్రధానాలయం మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2023 వార్షిక బ్రహ్మోత్సవాలు నూతనాలయంలో జరుగనున్నాయని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
అంబరాన్నంటిన సంబురాలు
11రోజులు సాగిన యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో పాల్గొని పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ అతిథులుగా వచ్చిన సీఎంఓ భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ పమేలా సత్పతి, టీటీడీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. బ్రహ్మోత్సవ నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమవంతు సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ, స్థానికులు, భక్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు.
– ఎన్.గీత, యాదాద్రి ఆలయ ఈఓ
ఉత్సవ సంపూర్ణానికి సూచకమే అష్టోత్తర శతఘటాభిషేకం
11రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహోత్సవాల సంపూర్ణానికి సూచకంగా అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. ఉత్సవాల్లో మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు అభిషేక మహోత్సవాన్ని ఆగమశాస్ర్తానుసారం చేపట్టామన్నారు. ఈ ఘటాభిషేకంలో కలశాలలో ఆవాహన చేయబడిన పవిత్ర జలాలతో పాటు వివిధ ఫలాల రసాలను మంత్ర పూతములను గావించి అభిషేకించుటయే ఈ వేడుక ప్రత్యేకత అని అన్నారు. సృష్టిలోని సర్వవిధ ఫలాలు, పుష్పాలు, రసాలు, జలాలు భగవత్ ప్రీతికరములై ఉన్నందున వాటిని భగవత్ సమర్పణ బుద్ధితో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహిస్తారని తెలిపారు. పంచామృత స్నపన ఫలితాలను ఆగమశాస్త్రంలో పేర్కొను ఇహ, పరముక్తి ప్రదం సర్వవిధ శుభకరం అని మరెన్నో అద్భుతాలైన ఫలితాలను అందించగలదని పురాణాలు, వేదాలు చెబుతున్నాయన్నారు.
నేటి నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే ఆర్జిత సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11రోజులుగా రద్దు చేసిన స్వామి వారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అర్చనలు, బోగాలు, బలిహరణ, అభిషేకాలు, మొక్కు సేవలు యథావిధిగా
నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
పరమశివుడికి రుద్రాభిషేకం
యాదాద్రి, మార్చి14 : యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో అర్చకులు, పురోహితులు పరమశివుడికి రుద్రాభిషేకం సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్‌లో వెలిసిన బాలశివాలయంలో ప్రభాతవేళలో మొదట గంటన్నర పాటు శివున్ని కొలుస్తూ చేసిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. శివాలయ ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. స్వామి నిత్యారాధనలు తెల్లవారుజామునే మొదలయ్యాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక వ్రతమాచరించారు. యాదాద్రిలో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. అన్ని విభాగాలతో కలిపి స్వామికి రూ.27,71,712 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.