నల్లగొండ, మార్చి 14 : నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీవల్లి టౌన్ షిప్)ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి అపూర్వ స్పందన లభించింది. మొత్తం 240 ప్లాట్లు ఉండగా తొలిరోజు 45 ప్లాట్లు ప్రత్యక్ష వేలం ద్వారా అమ్ముడయ్యాయి. ప్రభుత్వ ధర గజానికి రూ.7వేలు ఉండగా కనిష్టంగా రూ.7100 నుంచి గరిష్టంగా రూ.13, 500 వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవారం జరిగిన వేలానికి మంచి స్పందన వచ్చింది. ఉదయం సెషన్లో 33 మల్టీ పర్పస్, కమర్షియల్ ప్లాట్లు, మధ్యాహ్నం మిగిలిన ప్లాట్లు వేలంలో అమ్ముడయ్యాయి. ప్రభుత్వమే డీటీసీపీ నిబంధనల ప్రకారం లే అవుట్ చేసినందున ప్లాట్లకు డిమాండ్ లభిస్తున్నది. ఈ వెంచర్లో డిసెంబర్ 22 నాటికి విశాలమైన రోడ్లతో పాటు డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. దాంతో వేలంలో పాల్గొనేందుకు బిడ్డర్లు ఆసక్తి చూపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17 వరకు ఈ వేలం నిర్వహించనున్నందున ప్లాట్లు కావాల్సిన వారు రూ.10వేల డీడీ తీసి వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలంలో కొనుగోలు దారుడితో పాటు మరొకరికి అవకాశం కల్పించారు. వేలంలో ప్లాట్లు దక్కించుకున్న వారు వారం రోజుల్లోపు 33 శాతం డబ్బులు చెల్లించి 45 రోజుల లోపు మరో 33 శాతం, మిగిలిన డబ్బులు 90 రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రాజీవ్ స్వగృహ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, హెచ్ఎం డీఏ ఈఈ రమేశ్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, సీపీఓ బాలశౌరి, వెటర్నరీ జేడీ శ్రీనివాస్‌రావు, వివిధ ప్రాంతాలకు చెందిన బిడ్డర్లు పాల్గొన్నారు.