రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదో విడుత పల్లె ప్రగతి, నాల్గో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల భాగస్వామ్యంతో నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు పల్లెలు, ఇటు పట్టణాల్లో నేటి నుంచి 18వ తేదీ వరకు రోజు వారీగా నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నేడు అన్ని గ్రామాలు, వార్డుల్లో పాదయాత్రలతో ప్రారంభమై గ్రామ, వార్డు సభల నిర్వహణతో ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ దఫాలో క్రీడా మైదానాలతో పాటు హరితహారానికి ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ సిద్ధం చేశారు. పారిశుధ్యం, పచ్చదనం, పవర్ డే, పాత భవనాలు, బావుల పూడ్చివేత, వైకుంఠధామాల నిర్వహణ ఇలా ఇతర అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
నల్లగొండ ప్రతినిధి, జూన్2(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రోజువారీ కార్యాచరణ రూపొందించారు. అంశాల వారీగా ఏ ఏ రోజుల్లో ఏమి చేపట్టాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం నిత్యం అటు పల్లెలు, ఇటు పట్టణాల్లో దాదాపు ఒకే తరహా అంశాలకు చోటు కల్పించారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన స్థానిక ఎంపీటీసీ, వార్డుమెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, లైన్‌మన్, మిషన్‌భగీరథ టెక్నీషియన్ సభ్యులుగా పల్లె ప్రగతి కమిటీని ఏర్పాటు చేస్తారు. తొలి రోజు స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలో పాదయాత్ర అనంతరం గ్రామసభను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు.
ఇందులో స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొనేలా చూడాలి. ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆదాయ వ్యయాలు, గత పల్లె ప్రగతిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి.
క్రీడా మైదానాలకు అనువైన స్థలాల పరిశీలన, ఎంపిక, పనులను ప్రారంభించాలి. అన్ని ప్రభుత్వ భవనాలను సందర్శించి శుభ్రం చేయాలి. మురుగు నిల్వ లేకుండా, తాగునీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలి.
అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా కొత్త స్థలాలను ఎంపిక చేయడం, గుంతలు తీయడం, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలకు ఏర్పాట్లు, మొక్కలకు నీరు నిలిచేలా పాదులు తీయడం, ట్రీ గార్డ్స్ ఏర్పాటు, నీటిపారుదల భూముల్లో మొక్కల పెంపకానికి భూములను గుర్తించడం.
గ్రామాల్లో నీటి పారుదల శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించడం, వాటిల్లో మొక్కల పెంపకానికి అంచనాలు రూపొందించడం, కాల్వకట్టలు, మట్టి కట్టల వెంట మొక్కల పెంపకానికి స్థలాల ఎంపిక, గుంతలకు అంచనాలు సిద్ధం చేయడం.
కరెంటు బిల్లుల తయారీ, సమర్పణ. నిరుపయోగంగా ఉన్న మోటర్లకు, సరఫరా వ్యవస్థలకు ఉన్న మోటర్ల కనెక్షన్ల తొలిగింపునకు లేఖలు పంపడం. వీధి దీపాల కోసం మూడో వైర్ ఏర్పాటుకు చర్యలు. లూజ్ వైరింగ్, వంగిన, విరిగిన స్తంభాల స్థానాల్లో మరమ్మతులు. ఇతర విద్యుత్ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.
విద్యుత్, నీటి వసతి కల్పించడం, ఎండిన చెట్ల స్థానాల్లో కొత్తగా మొక్కలు నాటడం, బయో ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు, ఇంకా ప్రారంభం కాని వైకుంఠధామాలను వినియోగంలోకి తేవడం.
క్రీడా ప్రాంగణాల ప్రారంభం. శ్రమదానం నిర్వహణ. గ్రామాల్లో అవసరమగు చోట్ల శ్రమదానాలతో గ్రామాలను శుభ్రం చేయడం, 13 నుంచి పాఠశాలల పునప్రారంభం సందర్భంగా శ్రమదానం చేసి శుభ్రం చేయడం.
నర్సరీలను సందర్శించి మొక్కలను గ్రేడింగ్ చేయడం, ఎదుగుదలను పర్యవేక్షించడం.
తొలి రోజు నుంచి చేపట్టిన కార్యక్రమాల సమీక్ష. వివరణ, అత్యుత్తుమ సేవలందించిన అధికారులు, పౌరులకు సన్మానం.