e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News ఫ్లోరైడ్‌ పీడ విరగడ

ఫ్లోరైడ్‌ పీడ విరగడ

  • కొత్తగా నమోదు కాని ఫ్లోరోసిస్‌ కేసులు
  • జిల్లాలో ఫ్లోరైడ్‌ ప్రభావిత ఆవాసాలు నిల్‌
  • ఉద్యమ నేతగా ఫ్లోరైడ్‌ బాధితులను చూసి చలించిన కేసీఆర్‌
  • ఆనాడే నల్లగొండకు సురక్షిత నీళ్లిస్తా అని శపథం
  • మిషన్‌ భగీరథకు మునుగోడు నుంచే అంకురార్పణ

‘సూడు సూడూ నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండా.. బొక్కలు వంకరబోయిన బతుకుల నల్లగొండ జిల్లా.. దుఃఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు నల్లగొండ జిల్లా..’ అంటూ నాటి ఉద్యమ నేత, రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ స్వయంగా పాట రాశారు. ఉద్యమ నేతగా నల్లగొండ ఫ్లోరైడ్‌ వెతలపై ఎంతగా తాను ఆవేదన చెందాడనడానికి ఇదొక తార్కాణం. ఒళ్లు వంకర్లు తిరిగిన ఫ్లోరోసిస్‌ బాధితులను తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అనేకసార్లు కళ్లారా చూశారు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ అయిదుసార్లు కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. మర్రిగూడ మండల కేంద్రంలో రెండుసార్లు బస చేశారు. ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి కార్యాలయాన్ని సైతం సందర్శించి.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత.. నల్లగొండకు మంచి నీళ్లిస్తా..’ అనే సందేశాన్ని సైతం తన స్వహస్తాలతో రాశారు. ఉద్యమ సమయంలో ఫ్లోరైడ్‌పై ఇచ్చిన హామీ మేరకు అక్షరాలా నిజం చేసి చూపారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సమైక్య పాలకుల పాపంతో భూతంగా మారిన ఫ్లోరైడ్‌ నుంచి స్వరాష్ట్రంలో విముక్తి లభించింది. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికీ సురక్షిత మంచినీరు సత్ఫలితాలనిస్తున్నది. గడిచిన ఏడేండ్ల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనే అందుకు నిదర్శనం. 2015కు పూర్వం తెలంగాణలో 967 ఫ్లోరైడ్‌ ఆవాస ప్రాంతాలుండగా 2020 ఆగస్టు 1 నాటికి వాటి సంఖ్య సున్నాకు చేరుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారత సహజ వనరులు, ఆర్థిక నిర్వహణ సంస్థ (ఐఎన్‌ఆర్‌ఈఎం) చేసిన పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. తాగునీటిలో ఉండే ఫ్లోరిన్‌ పీపీఎం శాతం కూడా గణనీయంగా తగ్గిపోయిందని తేల్చిచెప్పింది.

నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్‌ 26 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,477 ఆవాస గ్రామాలకు గానూ 40శాతం గ్రామాల్లో ఫ్లోరైడ్‌ అధిక మొత్తంలో నమోదైంది. సాధారణంగా తాగునీటిలో 0.5 నుంచి 1 పీపీఎం ఉండాల్సిన ఫ్లోరైడ్‌ శాతం మర్రిగూడెం, నాంపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో అత్యధికంగా 28 శాతం వరకు ఉండడం గమనార్హం. వానలు లేని కరువు పరిస్థితులకు తోడు.. సమైక్య పాలనలో పూర్తిగా విస్మరణకు గురైన నల్లగొండ జిల్లాలో ఫోరైడ్‌ భూతం ఏటా వేలాది మందిని బాధితులుగా మార్చింది. పట్టుమని పాతికేళ్లు నిండకముందే కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి నేలకే పరిమితమైన వారు ఎందరో ఉన్నారు. ఎంతో మంది పాలకులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతులను సైతం కలిసి తమ బాధలను విన్నవించుకున్నారు. అయినా సరే ఏనాడూ తాగునీరివ్వాలనే ఆలోచనే రాలేదు. ఇక ఆ సమయంలోనే స్వరాష్ట్రం కోసం పుట్టుకొచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా ఫ్లోరైడ్‌ బాధితుల సమస్యపై మమేకమయ్యారు.

- Advertisement -

ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో కేసీఆర్‌ పర్యటన…

తెలంగాణ అణువణువుపైనా పట్టున్న కేసీఆర్‌.. ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్‌ ప్రాంతాల్లో పలు సందర్భాల్లో పర్యటించారు. 2003లో తొలిసారి మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లో మూడు రోజుల పాటు పర్యటించి అక్కడే బస చేశారు. స్వయంగా ఫ్లోరైడ్‌ బాధితుల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి బాధలు విని చలించిపోయారు. 2005లో మరోసారి పర్యటించారు. ఆ సమయంలోనే ‘సూడు సూడూ నల్లగొండా… గుండెల నిండా ఫ్లోరైడ్‌ బండా…’ అంటూ ఫ్లోరోసిస్‌ కష్టాలపై స్వయంగా పాట రాశారు. గుక్కెడు నీళ్లు కరువై… అంధకారమైన జీవితాలను చూసి చలించిపోయారు.స్వరాష్ట్రంలో ఫ్లోరిన్‌ పీడ నుంచి నల్లగొండ గడ్డకు ఏ విధంగా విముక్తి కల్పించాలో ఆనాడే ఆలోచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్‌ భగీరథకు రూపకల్పన చేశారు.

ఫ్లోరైడ్‌ భూతం ఖతం..

మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత తాగునీరందిస్తుండడంతో జిల్లాలో ఫ్లోరోసిస్‌ ప్రభావం క్రమంగా కనుమరుగవుతున్నది. ఏటా వైద్యారోగ్య శాఖ ఫ్లోరోసిస్‌ ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల నుంచి మూత్ర నమూనాలను సేకరించి డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నది. 2019 వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2016లో మొత్తం 50 స్కూళ్లలోని 1,380 మంది అనుమానిత విద్యార్థుల నమూనాలు పరీక్షించగా 413 మంది విద్యార్థుల్లో, 2019లో 94 మందిలో మాత్రమే 1.5 పీపీఎం కంటే ఎక్కువ ఫ్లోరిన్‌ శాతం ఉన్నట్లు గుర్తించారు. ఏటా ఫ్లోరైడ్‌ బాధితుల సంఖ్య తగ్గుతుండడంతో పాటు కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.పుట్టుకతో వచ్చిన దంతాలు ఊడిపోయి కొత్తవి వచ్చినప్పుడు ప సుపు పచ్చ గారలు ఉంటే ఆ చిన్నారిని ఫ్లోరోసిస్‌ బాధితుడిగా జనం గుర్తిస్తారు. ఇటీవల అలాంటి లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదని మర్రిగూ డెం, నాంపల్లి మండలాల ప్రజలు చెప్తున్నారు.

రోల్‌ మోడల్‌గా మిషన్‌ భగీరథ

రాష్ట్ర ప్రభుత్వం 2019లో మర్రిగూడ మండల కేంద్రంలో ఫ్లోరోసిస్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 3,500 మంది బాధితులకు ఈ కేంద్రం ద్వారా పునరావాస చికిత్స అందుతున్నది. ఇదిలా ఉండగా ఐఎన్‌ఆర్‌ఈఎమ్‌(ఇండియన్‌ న్యాచురల్‌ రిసోర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండేషన్‌) నల్లగొండ జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడాన్ని గుర్తించింది. ఈ ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నదని తేల్చింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ రక్షిత నీటిని అందించేందుకు శ్రీకారం చుట్టిన జాతీయ జల జీవన్‌ మిషన్‌కు సైతం మిషన్‌ భగీరథ రోల్‌ మోడల్‌గా నిలిచిందని చెప్పారు.

మునుగోడు నుంచే మిషన్‌ భగీరథకు శ్రీకారం…

ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గం నుంచే మిషన్‌ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. చౌటుప్పల్‌లో 2015 జూన్‌లో మిషన్‌ భగీరథ పైలాన్‌ ఆవిష్కరిస్తూ ‘ఇంటింటికీ రక్షిత నీరు అందిస్తా’నని స్పష్టం చేశారు. ఇంటింటికీ నల్లా పథకం పనులకు అంకురార్పణ చేశారు. ఫలితంగా మిషన్‌ భగీరథ పనులు ఉమ్మడి జిల్లాలో వేగంగా పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 2,226 కోట్ల అంచనాతో పనులు చేపట్టి 1,573కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 1,700 ఆవాస గ్రామాలకు రక్షిత తాగునీరు సరఫరా జరుగుతున్నది. సుమారు రూ.440కోట్లతో బట్లపల్లిలో 90 ఎమ్‌ఎల్‌డీ కెపాసిటీతో నీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మించారు. ఇందులోనూ ఫ్లోరైడ్‌ ప్రాంతమైన మునుగోడుకు అధిక నిధులు కేటాయించారు. రూ.120 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ అంతర్గత పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఏకేబీఆర్‌, టెయిల్‌పాండ్‌, ఉదయసముద్రం గ్రిడ్ల ద్వారా మిషన్‌ భగీరథ నీటి సరఫరా కొనసాగుతున్నది.

బతుకు మారిన బట్లపల్లి

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని బట్లపల్లి గ్రామం ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ప్లోరైడ్‌ ఉన్న ఊరు. బట్లపల్లిలో దాదాపు 250కి పైగా కుటుంబాలు నివాసం ఉండేవి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫ్లోరైడ్‌ బాధితులే. చేతులు, కాళ్లు వంకర పోవడం, విపరీతమైన కీళ్ల నొప్పులు, దంతాలు గార పట్టడం, నడివయస్సులోనే చేతికర్ర లేనిది అడుగు వేయలేని దీనస్థితి. తొలినాళ్లలో దీనిని అంతుచిక్కని రోగంగా అక్కడి వారు భావించేవారు. ఆ తర్వాత చేపట్టిన పరిశోధనల్లో బోర్ల నీరు తాగడం వల్ల వస్తుందని స్పష్టమైంది. తాగునీటిలో ఏకంగా 28పీపీఎం ఫ్లోరైడ్‌ ఉన్నట్లు వెల్లడైంది. దాంతో వలసలు మొదలయ్యాయి. మూడు కిలోమీటర్ల దూరంలో నివాసాలు ఏర్పరుచుకుని కొత్త బట్లపల్లిగా పేరు పెట్టుకున్నారు. వెరసి.. బట్లపల్లి అనే గ్రామం కేవలం ఫ్లోరైడ్‌ భూతం కారణంగా కనుమరుగైంది. ఉద్యమకాలంలోనే వీరి వెతలు కేసీఆర్‌ దృష్టికి వచ్చాయి. 2003లో కేసీఆర్‌ ఆ ప్రాంతంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మర్రిగూడెంలో బస చేసి బట్లపల్లి వాసులతో భేటీ అయ్యారు. మన రాష్ట్రం వస్తే… నీళ్ల గోస తీరుతుందని ధైర్యం చెప్పారు. పాత బట్లపల్లి దగ్గర కృష్ణా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించారు. 2018 జూన్‌లో మర్రిగూడ మండలంలోని గ్రామాలకు ఇంటింటికీ రక్షిత తాగు నీటి సరఫరా ఫథకం ప్రారంభమైంది. కొత్త బట్లపల్లిలోని 80ఇండ్లకు ఇంటింటికీ భగీరథ నీళ్లొస్తున్నాయి. గ్రామపంచాయతీ అయిన వట్టిపల్లిలోనూ 450 ఇండ్లకు రక్షిత జలాలు వస్తున్నాయి.

శాశ్వత పరిష్కారం దిశగా

ఆహార పంటల్లోనూ ఫ్లోరైడ్‌ ఆనవాళ్లను గుర్తించిన నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాగునీరు అందించేలా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. గొట్టిముక్కల, సింగరాజుపల్లి, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో అతి పెద్దదైన శివన్నగూడెం రిజర్వాయర్‌ను మర్రిగూడెం మండలం చర్లగూడెం వద్ద రెండు గుట్టలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నారు. 11.968 టీఎంసీల సామర్థ్యంతో వెడల్పైన రాతి, మట్టి కట్ట నిర్మాణం దాదాపు 60శాతం పూర్తైంది. మిగతా పనులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా గేట్లు నిర్మించే రివిట్‌మెంట్‌ స్థలంలోని బండ్‌ నిర్మాణం 40శాతం పూర్తి కావచ్చింది. రిజర్వాయర్‌ పూర్తై కుడి, ఎడమ కాల్వలు అందుబాటులోకి వస్తే సుమారు లక్ష ఎకరాలకు పైగా నీరంది ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పడనుంది.

ఫ్లోరైడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం

ఫ్లోరైడ్‌ సమస్యతో అల్లాడిన నల్లగొండ జిల్లాను సమైక్య పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. పెద్దోళ్లం అని చెప్పుకునే జిల్లా కాంగ్రెస్‌ నాయకులకు కూడా నీళ్లివ్వాలన్న సోయి రాలేదు. కానీ, ఉద్యమ నేతగా ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. ఈ విషయాన్ని ధృవీకరించిన కేంద్రమే అందుకు సాక్ష్యం. ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం టీఆర్‌ఎస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం.

నేను బతికుండగా నీళ్లు వస్తయనుకోలేదు

ఫ్లోరైడ్‌ మహమ్మారితో కాళ్లు చేతులు వంకర్లు పోయినయి. సాగర్‌ నీళ్లను మాకు మళ్లించాలని ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి సంస్థ ద్వారా ఢిల్లీ దాకా ఉద్యమం చేసినం. నేను బతికుండగా మంచి నీళ్లు వస్తయనుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇంటింటికీ నల్లాల ద్వారా భగీరథ నీళ్లు వస్తున్నయ్‌.

  • అంశల స్వామి, ఫ్లోరైడ్‌ బాధితుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement