ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి ప్రకటన చేయించడం చేతగాని బీజేపీ నేతలు రైతు బతుకుపై రౌడీయిజం చేస్తున్నారు. ‘ఇన్నాళ్లకు మాకు నీళ్లొచ్చినయ్. పంటలు మంచిగ పండుతున్నయ్. ఇప్పుడిప్పుడే మా బతుకులు గాడిన పడుతుంటే.. వడ్లు కొనేది లేదంటే ఏంజెయ్యాలె?’ అని ప్రశ్నించిన రైతులకు సమాధానం చెప్పలేక దాడులకు తెగపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆధ్వర్యంలో సాగుతున్న యాత్ర రెండో రోజూ రాక్షస క్రీడను తలపించింది. వందల వాహనాలు, పరాయి నేతలు, కిరాయి గూండాలు రాళ్లు, వెదురు కర్రలతో కొనుగోలు కేంద్రాలపై పడ్డారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్, ఆత్మకూర్.ఎస్‌లో రైతులు, పోలీసులు, టీఆర్ఎస్ నాయకులను గాయపర్చారు. అంతకుముందు రోజు కమల మూకలు నల్లగొండ జిల్లాలో ధాన్యం కుప్పలను నాశనం చేయడం చూసిన రైతాంగం.. పంటను కాపాడుకునేందుకు ధైర్యంగా ఎదురొడ్డింది. మహిళా రైతులు రాసులకు రక్షణగా నిలబడి నినాదాలు చేశారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోకి కూడా సంజయ్‌ను అడుగుపెట్టనివ్వలేదు. గంటల తరబడి నిరీక్షించిన బండి.. రైతుల నిరసనలతో రూటు మార్చి, షెడ్యూల్లోని కేంద్రాలను దాటుకుని వెళ్లిపోయాడు. బీజేపీ దౌర్జన్యకాండను ఖండిస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అరాచకం సృష్టిస్తున్న బీజేపీ శ్రేణులపై సూర్యాపేట జిల్లా రైతాంగం మండిపడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ‘మా కేంద్రాలకు రావొద్దు’ అంటూ అడుగడుగునా అడ్డుకున్నది. మంగళవారం జిల్లా అంతటా నిరసన వెల్లువెత్తగా చివ్వెంల, ఆత్మకూర్ ఎస్ మండలాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాంతో సంజయ్ కారుకే పరిమితం కాగా, అసహనానికి లోనైన బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైతులపైకి రాళ్లు విసిరారు. రైతులు కూడా ఎదురు తిరుగగా టీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచాయి. దాంతో బండి సంజయ్ రూటు మార్చుకుని తోకముడవక తప్పలేదు.
బండి దిగని సంజయ్
చివ్వెంల, నవంబర్ 16 : చివ్వెంల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పరాభవం ఎదురైంది. వట్టిఖమ్మం పహాడ క్రాస్ రోడ్డు వద్ద ఐకేపీ కేంద్రానికి వెళ్లాలనుకున్న సంజయ్‌ను రైతులు అడ్డుకున్నారు. ఊహించని విధంగా నిరసన సెగ తగులడంతో ఆయన రెండు గంటల పాటు కారులోనే నిరీక్షించారు. పోలీసులు డీసీఎం వాహనాన్ని తెప్పించి టీఆర్ఎస్ నాయకులను తరలించే ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. పార్టీ మండలాధ్యక్షడు జూలకంటి జీవన్‌రెడ్డి, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట-ఖమ్మం రహదారిపై అర్ధగంట పాటు బైఠాయించారు. దాంతో బండి సంజయ్ రోడ్డు పక్కనే ఉన్న ధాన్యం బస్తాల వద్ద 5 నిమిషాలు ఆగి వెళ్లారు. రైతులకు మద్దతుగా సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి, ధరావత్ బాబూ నాయక్, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, రామగిరి నగేశ్, ఊట్కూరి సైదులు, సత్యం, గురువేందర్, శ్యాంసన్ తరలివచ్చారు.
తెగబడిన కమలనాథులు
ఆత్మకూర్.ఎస్, నవంబర్ 16 : రైతు భరోసా యాత్ర పేరిట ఇతర జిల్లాలకు చెందిన బీజేపీ కార్యకర్తలతో దౌర్జన్యం కొనసాగిస్తున్న బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఆత్మకూర్.ఎస్. మండల కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నాయకులు రైతులపై దాడులు చేయడంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మండల కేంద్రంలో ‘బండి సంజయ్ గో బ్యాక్’ అంటూ మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఐకేపీ కేంద్రం వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ శ్రేణులు రాళ్లు విసరడంతో కానిస్టేబుల్ జంపాల శ్రీను, టీఆర్ఎస్ నాయకుడు దొంతరబోయిన సైదులు గాయపడ్డారు. పోలీసు ఆర్ఐ శ్రీనివాస్‌కి గుండెపోటు రావడంతో దవాఖానకు తరలించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో బండి సంజయ్ కాన్వాయ్ దిగకుండానే వెళ్లిపోయారు.
రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి..
సూర్యాపేట రూరల్, నవంబర్ 16 : రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన పార్టీ నాయకులే రైతు భరోసా యాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉన్నదని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. బండి సంజయ్ పర్యటనను నిరసిస్తూ గాంధీనగర్ గ్రామ సమీపంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులు నిర్మించి సాగు నీరందిస్తున్నారని, కరువు నేలను సస్యశ్యామలం చేశారని అన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ నాయకులకు రాష్ట్రంలో తిరిగే హక్కులేదన్నారు. ధర్నాలో జడ్పీటీసీ జీడి భిక్షం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎండీ చాంద్‌పాషా పాల్గొన్నారు.
బండి ..రైతు భక్షణ యాత్ర
బొడ్రాయిబజార్, నవంబర్ 16 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర కాదని.. ముమ్మాటికీ రైతు భక్షణ యాత్ర అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల మనుగడకే తీరని నష్టం కలిగించే విధానాలు అనుసరిస్తున్న బీజేపీ ఏ విధంగా భరోసా కల్పిస్తుందని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుంటే ఏ ముఖం పెట్టుకుని ఐకేపీ కేంద్రాలను సందర్శిస్తారని ప్రశ్నించారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయించాలని, రైతాంగానికి తీవ్ర నష్ట కలిగించే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముల్కలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, గోవింద్ పాల్గొన్నారు.
బీజేపీతో రైతులకు ఒరిగిందేమీ లేదు
బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రతో రైతులకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదని అసత్య ఆరోపణలు చేయడం కాదు… రైతులపై నిజంగా ప్రేమ ఉంటే దొడ్డు ధాన్యం కొనే విధంగా కేంద్రాన్ని ఒప్పించాలి. రైతుల గోస బీజేపీ ప్రభుత్వానికి పట్టదా..? రైతులు పండించిన ధాన్యం కొనలేని ప్రభుత్వం ఎందుకు? రైతులను గాలికొదిలి యాత్రల ద్వారా కపట ప్రేమ చూపించడం బీజేపీకే సాధ్యమైంది. బండి సంజయ్ యాత్రను ఇప్పటికైనా రద్దు చేసుకుంటే మంచిది.
తిరుమలగిరిలో గట్టి షాక్
తిరుమలగిరి, నవంబర్ 16 : రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకోవడంతో బండి సంజయ్ వెనుదిరిగారు. అర్వపల్లి నుంచి తిరుమలగిరికి రావాల్సిన బండి సంజయ్ మద్దిరాల, తుంగుతుర్తి, నాగారం మీదుగా ఇక్కడికి చేరుకుని శివారులోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ప్రెస్‌మీట్‌కే పరిమితమయ్యారు. అనంతరం జనగాం జిల్లా దేవరుప్పలకుకు వెళ్లాల్సి ఉండగా అక్కడ కూడా అడ్డుకునేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్ధంగా ఉండడంతో సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లారు.
10 కిలోమీటర్లు.. 4 గంటలు ప్రయాణం
సూర్యాపేట, నవంబర్ 16 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రైతుల నిరసన మధ్య కొనసాగింది. ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంకినేని నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలోని చివ్వెంల ఐకేపీ కేంద్రానికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంజయ్ బండి నెమ్మదిగా కదిలింది. చివ్వెంల ఐకేపీ సెంటర్లో రైతులు నిరసన తెలుపుతున్నారనే సమాచారంతో కిలోమీటరు దూరంలో కారును సుమారు రెండుగంటల పాటు నిలిపారు. చివరికి పోలీసుల సహకారంతో కొనుగోలు కేంద్రంలోకి వెళ్లి పది నిముషాల్లోనే తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు పట్టుకొని స్థానికంగా భయభ్రాంతులకు గురిచేశారు. అయినప్పటికీ రైతులు బెదరకుండా బీజేపీ, ప్రధానమంత్రి మోదీ, బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు హోరేత్తించారు. చెప్పులు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.