సవాళ్లతో కూడుకున్న బాధ్యతలు చేపట్టడడంలో పురుషులకేమీ తీసిపోమంటున్నారు నేటి మహిళలు. ఉదయం లేచినప్పటి నుంచి రాతి నిద్రపోయే వరకు ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ అధిగమించి విజయవంతంగా రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దుకున్నట్లే అన్ని పనులనూ చక్కబెడుతున్నారు.. మండల మహిళాధికారులు. కట్టంగూర్ మండలంలో ఉన్నత స్థాయి అధికారాలన్నీ మహిళలే చేపడుతున్నారు. ఎంపీడీఓ మొదలు డిప్యూటీ తాసీల్దార్, ప్రాథమిక వైద్యాధికారి, ఏపీఎం, తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు అన్ని స్థాయి పోస్టుల్లో వారే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో సమర్థవంతంగా రాణిస్తూ ‘మహిళలం.. మహారాణులం’ అని నిరూపించుకుంటున్నారు.
మంచి ఆశయంతో ముందుకు..
మంచి ఆశయంతోనే వైద్య వృత్తిలోకి వచ్చా. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే తపన ఉంది. అందుకు తగ్గట్టుగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా విధులు నిర్వర్తిస్తున్నా. దవాఖానకు వచ్చే మండల ప్రజలు ఓ డాక్టర్‌గా గౌరవిస్తుంటే అనందంగా ఉంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ప్రతి మహిళా అన్ని రంగాల్లో ముందుంటుంది
అభివృద్ధికి కృషి చేస్తా..
కార్యాలయాల్లో పనులంటే మహిళలు పురుషులను పంపిస్తుంటారు. ఒక మండల కీలక అధికారిగా మహిళ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోని మహిళలకు భరోసా కలుగుతుంది. అప్పుడే వారు నేరుగా కార్యాలయాలకు వచ్చి పనులు చేయించుకునే విధంగా చైతన్యం వస్తుంది. ఈ రకంగా మహిళలకు నమ్మకం కలిగే విధంగా విధులు నిర్వహిస్తే మంచి పేరు వస్తుంది. ఆ దిశగానే సేవలందిస్తూ మండల అభివృద్ధికి కృషి చేస్తున్నాను.
సమస్యలను సవాల్‌గా తీసుకోవాలి
మండల ప్రజల సహకారం మరువలేనిది. అందుకు తగ్గట్టుగానే మండలాభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. ప్రతి మహిళా సమస్యలను సవాలుగా తీసుకొని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా మండల స్థాయి అధికారులందరూ మహిళలే కావడంతో మండల అభివృద్ధికి మరింత దోహదపడే అవకాశం ఉంది.
సేవలో సంతృప్తిగా ఉంది…
గ్రామీణ ప్రాంతంలోని పేదలకు పథకాల పరంగా అందించే సేవల్లో చాలా సంతృప్తి ఉంది. తోటి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పథకాల అమలుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నా. కార్యాలయాలకు వచ్చే వారిని గౌరవించడంతో పాటు వారంతా గౌరవంగా పిలుస్తుంటే విధులపై నమ్మకం కలుగుతుంది. కార్యాలయంలో చేస్తున్న సేవల్లో ఎంతో సంతృప్తి ఉన్నది.