లోకేశ్వరం, డిసెంబర్ 15 : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ సర్పంచ్‌గా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటుతో గెలిచారు. వివరాల్లోకి వెళితే .. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బాగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల శ్రీవేద పోటీచేసింది. శ్రీవేద మామ మత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి రెండు నెలల క్రితం అమెరికాలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. పంచాయతీ ఎన్నికల్లో కోడలు పోటీ చేస్తున్నదని తెలుసుకొని పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు బాగాపూర్కు వచ్చాడు.
ఈ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లకుగాను 378 పోలయ్యాయి. ముత్యాల శ్రీవేదకు 189, సమీప ప్రత్యర్థి అభ్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు రాగా ఒక ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి వేసిన ఒక్క ఓటే గెలుపును నిర్ణయించిందని సదరు కుటుంబీకులు సంబురాలు చేసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ): తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చినట్టు సోమవారం సాయంత్రం పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. 18న ఉదయం 10గంటల వరకు ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి. శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషన్లు భారత న్యాయ సంహిత సెక్షన్ 163 ప్రకారం ఈ నిషేధ ఉత్తర్వులు జారీచేశారు.