Mustafizur row : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు అంశం బంగ్లాదేశ్ క్రికెట్ కు ఇబ్బందిగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ప్రభావం బంగ్లాదేశ్ క్రికెట్ పై గట్టిగానే పడే సూచనలున్నాయి. ఆ దేశ క్రికెట్ స్పాన్సర్స్.. స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే బంగ్లా క్రికెట్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ఇప్పుడు ఇదే అంశం ఆ దేశ క్రికెటర్లను ఆందోళనకు గురి చేస్తోందట.
బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఇండియాకు చెందిన ఎస్జీ (సన్స్పెరీల్స్ గ్రీన్ ల్యాండ్స్) సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ సహా పలువురు క్రికెటర్లకు స్పాన్సర్‌గా ఆర్థిక అండదండలు అందిస్తోంది. అయితే, ఇండియా-బంగ్లా దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇకపై బంగ్లా క్రికెటర్లకు స్పాన్సర్ చేయకూడదని ఎస్జీ నిర్ణయించుక్నుట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అక్కడి క్రికెటర్లు భారీగా నష్టపోతారు. దీని ప్రభావం బంగ్లా క్రికెట్ పై ఉంటుంది. అలాగే, ఇతర స్పాన్సర్లు కూడా వెనుదిరిగే అవకాశాలున్నాయి. దీంతో తమ క్రికెట్ జట్టుకు స్పాన్సర్ షిప్ లేకపోతే.. ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆ దేశ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) భావిస్తోంది.
ఈ విషయంలో ప్రస్తుతం క్రికెటర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆ బోర్డు మెంబర్ తెలిపారు. అయితే, స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగడంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ, తాజా పరిణామాలు మాత్రం ఈ నిర్ణయం తప్పదని సూచిస్తున్నాయి. ఇక.. రాబోయే టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి తమ జట్టు ఇండియాలో ఆడబోదని, మరో వేదిక నిర్ణయించాలని బీసీబీ.. ఐసీసీని కోరింది. కానీ, దీనికి ఐసీసీ అంగీకరించలేదు.